- 20 స్వర్ణాలతో అగ్రస్థానం.. 2024 ఒలింపిక్స్ బెర్త్‌లే లక్ష్యం
హాంగ్జౌ: 19వ ఆసియా క్రీడల్లో ఆతిథ్య చైనా తన హవా తొలిరోజు నుంచే చాటుతోంది. 40ఏళ్లుగా ఆసియా క్రీడల్లో మకుటంలేని మహారాజుగా వెలుగొందుతున్న చైనా.. తొలిరోజు ఆటలు ముగిసే సరికి ఏకంగా 20స్వర్ణాలతో సహా మొత్తం 30 పతకాలతో అగ్రస్థానంలో నిలిచింది. మహిళల లైట్‌వెయిట్ డబుల్ స్కల్స్‌లో చైనా తొలి స్వర్ణ పతకాన్ని ముద్దాడి ఈసారి పతకాల వేటను మొదలు పెట్టింది. పెంటథ్లాన్(2), ఆర్టిస్టిక్ జిమ్నా స్టిక్స్(1), రోయింగ్(6), షూటింగ్(2), వుషూ(2), స్విమ్మింగ్(7) స్వర్ణాలను చైనా తొలిరోజు కైవసం చేసుకుంది. 200మీ. బటర్‌ఫ్లైలో జాంగ్ యుఫీ వ్యక్తిగత విభాగంలో తొలి బంగారు పతకాన్ని ముద్దాడింది. జపాన్‌లోని వుకుయోకాలో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి ఆమె తొలిసారి ఆసియా క్రీడల్లో చైనాకు ప్రాతినిధ్యం వహిస్తోంది. ఇక దక్షిణ కొరియా జట్టు తొలిరోజు ఐదు స్వర్ణాలతో సహా 14 పతకాలతో రెండోస్థానంలో నిలిచింది. పెంటాథ్లాన్, తైక్వాండోలో రెండేసి, ఫెన్సింగ్‌లో ఒక స్వర్ణం దక్షిణ కొరియా దక్కాయి. హాంకాంగ్ పురుషుల జట్టు ఒక స్వర్ణాన్ని సాధించగా.. ఫెన్సింగ్ వ్యక్తిగత విభాగంలోనూ ఆ జట్టుకు మరో బంగారు పతకాన్ని ఖాయం చేసింది. అలాగే తైవాన్, ఉజ్బెకిస్తాన్‌లకు తొలిరోజు ఒక్కో బంగారు పతకాలు దక్కాయి. ఆతిథ్య దేశం పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిస్తే హోమ్ ఫీల్డ్ మెడల్ కూడా దక్కనుంది. ఈ క్రీడల్లో సత్తా చాటి 2024 పారిస్ ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సాధించడమే ప్రధాన లక్ష్యంగా చైనా అథ్లెట్లు బరిలోకి దిగారు. రెండోరోజు పోటీలు ముగిసేసరికి చైనా 39స్వర్ణ, 21రజిత, 9 కాంస్యా లతో సహా మొత్తం 69 పతకాలతో మిగతా దేశాల కు అందనంత ఎత్తులో నిలిచింది. ఇక ఐదేళ్ల క్రితం ఇండోనేషియాలోని జకార్తా వేదికగా జరిగిన 18వ ఆసియా క్రీడల్లో చైనా 132 స్వర్ణాలతో సహా 300 పతకాలు చేజిక్కించుకొని అగ్రస్థానంలో నిలి చింది. ఆ తర్వాత జపాన్, దక్షిణ కొరియా నిలిచాయి. చైనా వేదికగా జరిగే 19వ ఆసియా క్రీడల్లో 45దేశాల నుంచి 12,500కు పైగా అథ్లెట్లు పాల్గొంటున్నారు. వచ్చే ఏడాది జరిగే పారిస్ ఒలింపిక్స్‌లో 200 మంది అధికారులు 10,500మంది అథ్లెట్లు కంటే ఇది అధికం.










