- విదేశాలకు నిలిచిన ఎగుమతులు
- ధరల పెరుగుదల కూడా కారణమే !
ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధి : తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు నెల రోజులుగా ఇతర దేశాలకు మిర్చి ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. ఇందుకు ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడిన ఆర్థిక మాంద్యమే కారణమని వ్యాపారులు చెప్తున్నారు. ధర పెరగడం కూడా మరో కారణమని అంటున్నారు. గత సెప్టెంబరు చివరి వరకూ గుంటూరు, వరంగల్, ఖమ్మం తదితర ప్రాంతాల నుంచి బంగ్లాదేశ్, ఇండోనేషియా, సింగపూర్, థాయిలాండ్, ఆఫ్రికన్ దేశాలకు మిర్చి ఎగుమతైంది. గుంటూరు నుంచి ఏటా రెండు లక్షల క్వింటాళ్ల మిర్చి బంగ్లాదేశ్, శ్రీలంక, ఇండోనేషియా, సింగపూర్ తదితర దేశాలకు ఎగుమతి అవుతుంటుంది. ఇందులో 80 శాతం బంగ్లాదేశ్‌కు పంపుతారు. ఆ దేశం నుంచి పలు ముస్లిం దేశాలకు ఎక్కువగా ఎగుమతి జరిగేది. బంగ్లాదేశ్ జంక్షన్ పాయింట్‌గా ఉండేది. బంగ్లాదేశ్‌లో ఏర్పడిన ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రస్తుతం ఆ దేశం మిర్చి కొనుగోలు ఆర్డర్లు నిలిపివేసిందని వ్యాపారులు చెప్తున్నారు. లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్సి) జారీ ప్రక్రియను నిలిపివేయడంతో తెలుగు రాష్ట్రాల నుంచి మిర్చి ఎగుమతులు ఆ దేశానికి ఆగిపోయాయి. సింగపూర్, థాయలాండ్, ఫిలిప్పైన్స్కు కూడా ఎగుమతులు నిలిచిపోయాయి. ధరలు భారీగా పెరగడం వల్ల ఈ దేశాలు ఆర్డర్లు ఇవ్వడం లేదని వ్యాపారులు చెప్తున్నారు. గతేడాది మిర్చికి తామర తెగులు రావడంతో దిగుబడి గణనీయంగా తగ్గింది. మధ్యప్రదేశ్, మహరాష్ట్రలో కూడా అధిక వర్షాలకు పంట బాగా దెబ్బతింది. దీంతో మిర్చి ఉత్పత్తి తగ్గి ధరలు పెరిగాయి. క్వింటాలు కనిష్ట ధర రూ.20 వేలు, గరిష్ట ధర రూ.30 వేలుపైగా ఉంది. ధరలు భారీగా పెరగడంతో కొన్ని దేశాలు మనదేశం నుంచి మిర్చిని దిగుమతి చేసుకోవడానికి ముందుకు రావడం లేదు. బంగ్లాదేశ్ ఎప్పటికప్పుడు ఎల్సిలు ఇచ్చేది. కానీ, గత నెల రోజులుగా ఎల్సిలు నిలిపివేసింది. ఆర్థిక సంక్షోభంలో ఉన్న శ్రీలంకకు ఏడాది కాలంగా ఎగుమతులు లేవు. ధర అధికంగా ఉందని, మిర్చిపై పురుగుమందుల అవశేషాలు ఎక్కువగా ఉంటున్నాయని చైనా తదితర దేశాలు దిగుమతికి ఆసక్తి చూపడం లేదు. ప్రత్యామ్నాంగా స్థానిక ఉత్పత్తులపై ఆధారపడుతున్నాయి. పలు దేశాల్లో మిర్చి లిక్విడ్‌కు డిమాండ్ ఉన్నట్టు తెలిసింది. తెలుగు రాష్ట్రాల నుంచి మిర్చి లిక్విడ్ తయారీ లేకపోవడంతో ఆయా దేశాలు దిగుమతికి ఆసక్తి కనబర్చడం లేదు.










