
'ధూమపానం.. ఆరోగ్యానికి హానికరం.. చుట్ట, బీడీ, తంబాకు.. మిమ్మల్ని మృత్యువుకు దగ్గర చేస్తాయి..' అంటూ టీవీలో ప్రకటన వచ్చినప్పుడు చాలామంది పిల్లలు పెద్దగా పట్టించుకోరు. కానీ, ఓ చిన్నారి మాత్రం దాన్ని గురించి వాళ్ల నాన్నను పదే పదే ప్రశ్నించేది. ప్రపంచాన్ని కుదిపేస్తున్న అతిపెద్ద సమస్యపై ఆలోచించలేని ఆ వయసు పిల్లల్లో రాని కుతూహలం తన కూతురు చూపిస్తుంటే ఆ తండ్రికి తెగ ఆశ్చర్యమేసేది. అందుకే విసుక్కోకుండా తనకు అర్థమయ్యే భాషలో చెప్పేవాడు. ఇదంతా ఒకప్పుడు.. ఇప్పుడు.. ఆ బాలిక ఓ బృహత్తర కార్యక్రమాన్ని భుజాన వేసుకుని ముందుండి నడిపిస్తోంది. హైద్రాబాద్‌కు చెందిన టానియా బేగం (12) తన ఈడు పిల్లల్లో చాలామందికి తెలియని మత్తు పదార్థాల నిరోధక వ్యవస్థపై ఉక్కుపాదం మోపేందుకు తన గళాన్ని వినిపిస్తోంది. 7 ఏళ్ల నుండే 'డ్రగ్ ఫ్రీ వరల్డ్' ఫౌండేషన్ బ్రాండ్ అంబాసిడర్‌గా సేవలు అందిస్తోంది.

'టీవీలో కార్టూన్ బొమ్మలు అందరు పిల్లలూ చూస్తారు. నేను కూడా కార్టూన్‌లు చూస్తాను. డోరోమ్యాన్ కార్టూన్ అంటే నాకు చాలా ఇష్టం. అందులో హీరో (డోరోమ్యాన్)లాగా నేను కూడా ఏదైనా మంచి పని చేయాలనుకునేదాన్ని' అంటున్న టానియా ఇటీవల ఓ రోజు అంబర్‌పేట కూరగాయల మార్కెట్‌కి వెళ్లింది. అందరిలా తను కూడా కూరగాయాలు కొనుక్కోవడానికే వచ్చిందని అక్కడున్నవాళ్లు అనుకున్నారు. కానీ టానియా ఆ గుంపులకు వినపడేలా, 'హారు, నా పేరు టానియా. మీలో ఎవరు పొగ తాగుతున్నారు. మత్తు పదార్థాలు తీసుకుంటున్నారు' అంటూ గట్టిగా అడుగుతూ ముందుకు నడుస్తోంది. ఎవరో ఒకరు పొగతాగుతున్నట్లు ఆమె దృష్టికి రాగానే ఎంతో ఉద్వేగభరితమైన, స్ఫూర్తివంతమైన, ప్రభావంతమైన ప్రసంగాన్ని ప్రారంభించింది. ఆమె మాట్లాడుతున్నంతసేపు ఎవ్వరూ కళ్లు, కాళ్లు కదపలేదు. చుట్టుపక్కల ఉన్నవాళ్లు కూడా ఆమె దగ్గరికి వచ్చేశారు. టానియా తండ్రి సలాలుద్దీన్ షేక్ సామాజిక కార్యకర్త. వ్యసనాలపై అవగాహన కల్పిస్తూ హైద్రాబాద్‌లో పలు మారథాన్‌లు నిర్వహిస్తుంటారు. బాల్యం నుండే వాటిల్లో పాల్గొనేది టానియా. వ్యసనం జీవితాలను ఎంతలా నాశనం చేస్తుందో ఎన్నో ఉదాహరణలను ప్రత్యక్షంగా చూసింది. అవగాహన కల్పించేందుకు తను కూడా నడుం బిగించాలని అప్పుడే నిశ్చయించుకుంది.
తనను అడ్డుకున్నాను
'ఒక సామాజిక కార్యకర్తగా నా పని నేను చేసుకుపోయేవాడిని. టానియా నా కార్యక్రమాల్లో భాగం కావాలని ఎప్పుడూ అనుకోలేదు. ఒక్కోసారి అడ్డుకోవడానికి కూడా ప్రయత్నించేవాడిని. కానీ తను ఎప్పుడూ మాదకద్రవ్యాల విషయాలపై వార్తా కథనాలు, పుస్తకాలు, యూట్యూబ్ వీడియోలను అనుసరించేది. వాటిని లోతుగా అధ్యయనం చేసేది. తన ఆసక్తిని చూసి నాకు చాలా ఆశ్చర్యమేసేది. అందుకే ఆ తరువాత ఎప్పుడూ తనను నిరాశపరచలేదు. ఇప్పుడు ఆమె చేస్తున్న సేవ చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంటోంది' అంటున్నాడు ఆ తండ్రి.
కరపత్రాలు పంచిపెడుతూ ...
టానియా అభిరుచిని తెలిసిన ఓ స్వచ్చంధసంస్థ ఆమెకి మద్దతుగా నిలిచింది. మాదకద్రవ్యాల నియంత్రణపై పలు పోస్టర్లు, కరపత్రాలు పంచిపెట్టే పనిని అప్పగించింది. 'సంస్థ ఇచ్చిన పోస్టర్లు తీసుకుని వీధుల్లో అంటించేదాన్ని. రద్దీగా ఉన్న ప్రదేశాల్లో కరపత్రాలు పంచేదాన్ని. అప్పుడు నేను డోర్‌మ్యాన్‌లా భావించేదాన్ని' అంటోన్న టానియాలో చిన్నపిల్లల్లో సాధారణంగా కనిపించే అమాయకత్వం కనిపించింది.
బ్రాండ్ అంబాసిడర్‌గా
'ఒక మంచి పని కోసం చిన్నపిల్ల చేస్తున్న సాయం' అంటూ ఆ సంస్థ సోషల్‌మీడియాలో షేర్ చేసిన వీడియోని చూసిన ప్రపంచ సంస్థ 'డ్రగ్ ఫ్రీ వరల్డ్' టానియాను తమ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికచేసింది. అప్పుడామె వయసు ఏడేళ్లు.
'డ్రగ్ ఫ్రీ వరల్ట్' ఇచ్చిన ప్రోత్సాహంతో ఇప్పుడు టానియా స్కూళ్లు, కాలేజీలు, మార్కెట్లు, కార్యక్రమాలు ఎక్కడైతే జనసందోహాలు ఉంటాయో అక్కడ ప్రచారం చేస్తోంది. తన చిన్న గొంతుకతతో ఆమె ఇచ్చే ప్రసంగాన్ని ఎంతోమంది పెద్దలు కన్నార్పకుండా చూస్తారు, వింటారు.

సెలబ్రిటీలే కారణం
'తెలంగాణలో మద్యపానం అతిపెద్ద వ్యసనం. ఇక్కడ చాలామంది మత్తుపదార్థాలకు బానిసలు' అంటున్న టానియా ఈ సమస్యకు పరిష్కారం దిశగా అడుగులు వేస్తోంది. ముందుగా ఆయా మత్తు పదార్థాలు, మద్యం అమ్మకాలకు ప్రచారకర్తలుగా ఉన్న సినీ సెలబ్రిటీలకు ట్విట్టర్ వేదికగా విజ్ఞాపనలు పంపింది. విచిత్రంగా కొన్ని రోజులకే ఆమె ట్విట్టర్ ఎకౌంట్ నిషేధానికి గురైంది. అయినా ఆమె తన ప్రయత్నాన్ని విరమించుకోలేదు. మరో ఖాతా తెరిచి తన పని చేసుకుపోతోంది. 'చాలా మంది యువత ఈ వ్యసనాలకు బానిసలవ్వడానికి కారణం, వారు అభిమానించే నటులు సినిమాల్లో అనుసరిస్తున్న విధానాలు. అందుకే నేను వారికి సోషల్ మీడియా వేదికగా సందేశాలు పంపేదాన్ని. అయితే నాకు మద్దతుగా నిలవాల్సిన మీడియా నన్ను కట్టడ ిచేసేందుకు ప్రయత్నించింది' అంటూ తనకు ఎదురైన అనుభవం గురించి చెబుతోంది.
'సోషల్ మీడియా వినియోగం బాగా పెరిగిన ఈ రోజుల్లో బడి ఈడు పిల్లలు కూడా మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు. 'ఈ-సిగరేట్ల'ను వాడుతున్న పిల్లల గురించి తెలిసి చాలా బాధపడ్డాను. అందుకే స్కూళ్లకు వెళ్లి కూడా ప్రచారం చేస్తున్నాను' అంటున్న టానియాలో సమాజం బాగుండాలన్న తపన కనపడుతోంది.
టానియా, 'యునిసన్ ఇంటర్నేషనల్' స్కూల్లో ఐదో తరగతి చదివేటప్పుడు స్కూలుకు దగ్గరగా ఓ మద్య దుకాణం ఉండేది. ఒకరోజు తనతోటి విద్యార్థుల్లో కొంతమందిని అక్కడ చూసింది. అంతే.. ఆ షాపుకు వెళ్లి, ఆ దుకాణాన్ని మూసేయమని షాపు యజమానితో వాదించింది. అతను మాట వినలేదు.. దీంతో కొంతమంది స్నేహితుల సాయంతో షాపుకు వచ్చే వారికి మద్యపానం దుష్ప్రభావాలను చెప్పడం ప్రారంభించింది. టానియా ప్రోత్సాహంతో స్కూలుకు వచ్చి చదువుకుంటున్న పిల్లలు రోజూ దుకాణానికి రావడం, అవగాహన కల్పించడం పనిగా పెట్టుకున్నారు. వారి చర్యలు అక్కడికి వచ్చే పెద్దవారిని ఆలోచనల్లో పడేశాయి. ఫలితంగా మద్యం దుకాణం మూతపడింది. ఇది టానియా తిరుగులేని స్ఫూర్తికి, మాదకద్రవ్య రహిత ప్రపంచాన్ని సృష్టించే అచంచలమైన ఆమె నిబద్ధతకు నిదర్శనం.