Sep 12,2023 17:13

ప్రజాశక్తి-పీలేరు (అన్నమయ్యజిల్లా) : ఐదేళ్ల లోపు పిల్లలు, గర్భవతులకు క్రమం తప్పకుండా టీకాలు అందించాలని అన్నమయ్య జిల్లా ఇమ్మ్యూనైజేషన్‌ అధికారిణి (డిఐఓ) డాక్టర్‌ ఉషశ్రీ తెలిపారు. మంగళవారం రేగళ్ళు ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని దొడ్డిపల్లి సచివాలయం, నాలేవాండ్లపల్లి గ్రామం, బాలంవారిపల్లి సచివాలయంలలో జరిగిన ఇంటెన్సిఫైడ్‌ మిషన్‌ ఇంద్రధనుష్‌ కార్యక్రమాన్ని డిఐఓ అకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ 5 ఏళ్ళలోపు పిల్లలు, గర్భవతులకు క్రమంగా ఇచ్చే టీకాల కార్యక్రమంలో అన్ని రకాలు టీకాలు ఇవ్వడం జరుగుతూందన్నారు. వాక్సిన్‌ తో నివారించగల వ్యాధుల నుంచి ప్రతి బిడ్డకూ 100 శాతం రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉందని అన్నారు. ముఖ్యంగా అత్యంత సమశ్యాత్మక ప్రాంతలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. అలాగే టీకాల కార్యక్రమం రికార్డులను తనిఖీ చేసి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిహెచ్‌ఓ జయలక్ష్మి, ఆరోగ్య కార్యకర్తలు రమాదేవి, గంగులమ్మ, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.