
- డిఎంహెచ్‌ఓ కార్యలయం వద్ద ఆశాల ధర్నా
ప్రజాశక్తి-కాకినాడ : ఆశ వర్కర్ల సమస్యలపై సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. సుందరయ్య భవన్ నుండి ర్యాలీగా డిఎంహెచ్‌ఓ ఆఫీస్ కి చేరుకున్న వందలాది మంది ఆశా కార్యకర్తలు సమస్యలపై నినాదాలు చేశారు. ఆశా వర్కర్లకు రక్షణ కల్పించాలని, దాడులు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అధికారులు వేధింపులు ఆపాలని, జాబ్ చార్ట్ విడుదల చేయాలని, అధిక పనిభారాన్ని తగ్గించాలని, ఆశా వర్కర్ల నియామకాలలో రాజకీయ జోక్యాన్ని నివారించాలని, చనిపోయిన ఆశ వర్కర్ల కుటుంబాలలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న పారితోషకాల స్థానంలో కనీస వేతనం 26వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షురాలు జి.బేబిరాణి, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నర్ల ఈశ్వరి, చంద్రమళ్ల పద్మ, సిఐటియు అధ్యక్ష, కార్యదర్శులు దువ్వ శేషబాబ్జి, చెక్కల రాజ్ కుమార్, సిఐటియు నగర అధ్యక్షులు పలివేల వీరబాబు మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాల సందర్బంగా ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని ఆంధ్రప్రదేశ్లో ఆశాలకు ఇతర రాష్ట్రాల కంటే అదనంగా వేతనాలు చెల్లిస్తున్నామన్నప్పుడు కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలలో ఆశా కార్యకర్తల ఎంత చెల్లిస్తున్నారో తెలుసుకోవాలని ఎద్దేవా చేశారు. కొన్ని రాష్ట్రాలలో ఈ మధ్యకాలంలోనే ఆశాల నియామకాలు చేసారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆశాల చేత చేయిస్తున్న గొడ్డు చాకిరి ఇతర ఏ రాష్ట్రాలలో కూడా లేదని విమర్శించారు. ప్రభుత్వం ఇచ్చిన సెల్ ఫోన్లు పనిచేయడం లేదని, అప్పుడప్పుడు ఇస్తున్న 10వేల వేతనంలో సొంత ఫోన్లు కొనుగోలు చేసుకోని సర్వేలు చేయాలని, రికార్డులు కూడా మీరే కొనుగోలు చేసుకోవాలని అధికారులు ఒత్తిడి చేయడం మానుకోవలన్నారు. అధికారి పార్టీ నేతల పేరుతో ఆశా వర్కర్లపై దాడులు చేస్తుంటే, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కళ్ళు మూసుకుని ఏమి జరగనట్టు ఉంటున్నారని, దాడులు చేసిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని, దాడుల పట్ల మౌనం వహించిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా అధికారుల ఆదేశాల పేరుతో ఆశా వర్కర్లపై పని భారం పెంచుతూ అధికారులు చేయాల్సిన సర్వేలను సైతం ఆశా వర్కర్లతో చేయిస్తున్నారని విమర్శించారు. 104 వాహనం వస్తున్న ప్రాంతాలలో ఉద్యోగుల భోజనాలు, టిఫిన్లు ఖర్చులు సైతం ఆశా వర్కర్ల దగ్గర వసూలు చేస్తున్నారని, వ్యాక్సిన్ క్యారేజీలను ఆశా వర్కర్లతో తెప్పిస్తూ కనీసం దారి ఖర్చులు కూడా ఇవ్వడం లేదని, వెయ్యి జనాభాకు ఆశా వర్కర్ ఉండాల్సింది పోయి, ఐదువేల జనాభాకు ఒక ఆశ వర్కర్ చేత పనిచేయిస్తూన్నారని అన్నారు. తక్షణమే పనిభారం తగ్గించాలని డిమాండ్ చేశారు. కాకినాడ జిజిహెచ్ పురుడు కేసులు తీసుకువెళ్తున్న సందర్బంలో జిజిహెచ్ సిబ్బంది, సెక్యూరిటీ గార్డులు ఆశా కార్యకర్తలను లోపలికి అనుమతించకుండా గర్భిణీల కుటుంబసభ్యుల ముందే అవమానకరంగా మాట్లాడుతున్నారని తెలిపుతూ వినతిపత్రాన్ని జిల్లా డి ఎం అండ్ హెచ్ ఓ రమేష్ కి అందించగా, ఆశాలకు జబ్ చార్ట్ విడుదల చేస్తామని, జిల్లా నుండి సర్వేలను ఆశాల చేత చేయించాలని ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదని తెలిపారు. దిగువస్థాయి అధికారుల వేధింపులు ఉన్నట్లయితే తక్షణమే తన దష్టికి తీసుకువస్తే పరిష్కారిస్తానని హామీ ఇచ్చారు. ఇతర పెండింగ్ డిమాండ్లపై యూనియన్ నాయకత్వాన్ని చర్చలకు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇరుబండి చంద్రవతి మద్దతుగా మాట్లాడారు. సిఐటియు జిల్లా కోశాధికారి మలకా రమణ, జిల్లా వర్కింగ్ కమిటీ సభ్యులు రొంగల ఈశ్వరరావు, షేక్ పద్మ, నక్కెళ్ల శ్రీను, మెడిశెట్టి వెంకటరమణ, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ సభ్యులు నొక్కు లలిత, ఎం.భారతి, ఆర్.నాగలక్ష్మి, ఎం.లక్ష్మి, సిహెచ్.వెంకటలక్ష్మి, మలకా నాగలక్ష్మి, చెక్కల వేణు, వి.ఉమావతి, ఎస్.సత్యవతి, భవాని తదితరులు పాల్గొన్నారు.

