Jul 18,2023 16:33

ప్రజాశక్తి-కాకినాడ : ఆశాలకు ధరల కనుగుణంగా 26వేలు వేతనం పెంచాలని, ఆన్‌లైన్‌ వర్కులు ఆపాలని, మెటర్నిటీ లీవులు, ప్రభుత్వ సెలవులు ఆశాలకు అమలు చేయాలని, విధి నిర్వహణలో అధికారులు వేధింపులు నివారించాలని, ఎన్‌.సి.డి సర్వే ఆశాలకు సంబందం లేదని ఉతర్యులు ఇవ్వాలని, 10లక్షల భీమా కల్పించాలని కోరుతూ ఏపీ ఆశా వర్కర్స్‌ కాకినాడ జిల్లా కమిటీ సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం ముట్టడి నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా గౌరవ అధ్యక్షులు జి బేబీరాణి, అధ్యక్ష, కార్యదర్శులు నర్ల ఈశ్వరి, చంద్రమళ్ల పద్మ, సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వ శేషుబాబ్జి మాట్లాడుతూ.. గతంలో ఆందోళనల సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదన్నారు. ఆశాలు నిర్వహించాల్సిన విధులు ఏమిటో జబ్‌ చార్ట్‌ ఇవ్వకుండా ప్రభుత్వ అధికారులు చేయాల్సిన అన్ని పనులను ఆశలతో చేయించడం తగదన్నారు. 1000 పాపులేషన్‌ పరిధిలో ఒక ఆశా వర్కర్‌ ఉండాల్సింది పోయి ఐదువేల మంది ప్రజల మధ్యన ఒక ఆశాతో పని చేయిస్తూ గొడ్డుచాకిరీ చేస్తున్నారన్నారు. తుని ఆశా కార్యకర్తలకు నాలుగు నెలల వేతనం బకాయి పెడితే ఎలా బ్రతకాలని ప్రశ్నించారు. ఫీల్డ్‌లో తిరగాల్సిన ఆశా వర్కర్లను సచివాలయంలో ఉదయం నుండి సాయంత్రం వరకు కూర్చోబెడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ రికార్డులు సైతం ఆశాల సొంత డబ్బులతో కొనాలని అధికారులు చెప్పడం కంటే సిగ్గుచేటైన పని మరొకటి లేదని విమర్శించారు. యు కొత్తపల్లి ప్రాంతంలో ఫ్యామిలీ ఫిజీషియన్‌ ప్రోగ్రాం గ్రామాల్లో నిర్వహిస్తున్నప్పుడు ఆశాల చేత టేబుల్స్‌, భోజనాలు, టిఫిన్లు, ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని అధికారులు ఒత్తిడి చేయడం మానుకోవాలని హెచ్చరించారు. సమస్యలపై సమాధానం కోరుతూ ఆశాలు వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలోకి వెళ్లేందుకు సిద్ధపడడంతో డి.ఎం.హెచ్‌.ఓ డాక్టర్‌ రమేష్‌, ఏవో సూర్యచంద్ర, డి.పి.హెచ్‌.ఎన్‌.ఓ రమణమ్మ , డిసిఎం మణికుమారి బయటకివచ్చి ఆశాల డిమాండ్లపై స్పందిస్తూ ఆశాలకు జాబు చార్టు సాయంత్రంలోగా అందిస్తామని, లెప్పర్సి సర్వే మినహా ఆన్లైన్లో వర్కులు మీరు చేయాల్సిన పనిలేదని, సెల్‌ ఫోన్లు సాఫ్ట్వేర్‌ అప్డేట్‌ మేమే చేయిస్తామని, ఆశాలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడే అధికారులపై చర్యలు తీసుకుంటామని, సచివాలయానికి ఆశాలకు సంబంధం లేదని, ఆశాలు సచివాలయ రికార్డులో సంతకాలు చేయాల్సిన పనిలేదని స్పష్టం చేశారు. ఆశా కార్యకర్తల హక్కుల పోరాటాలకు ఆటంకాలు కల్పించాలానే ఆదేశాలు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం నుండి పంపలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా ఉపాధ్యక్షులు ఎం.లక్ష్మి, రాయుడు నాగలక్ష్మి, రమణమ్మ, జిల్లా కోశాధికారి నొక్కు లలిత, సహయ కార్యదర్శి ఎం.భారతి, గంగాభవాని, గ్రేసీ, రాజేశ్వరి, పద్మావతి, అనంతలక్ష్మి, సిఐటియు వర్కింగ్‌ కమిటీ సభ్యులు నక్కెళ్ళ శ్రీనివాసు, షేక్‌ పద్మ, జిల్లా కోశాధికారి మలకా రమణ, జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్‌ కుమార్‌ ,ఎం రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.