- సెప్టెంబర్ 1న చలో విజయవాడ
- ఎపిసిపిఎస్‌ఇఎ పిలుపు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సిపిఎస్)ను రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ (ఒపిఎస్) అమల్జేయాలనే డిమాండ్‌తో ఉద్యోగులు పోరాటానికి సిద్ధమవతున్నారు. 'ముఖ్యమంత్రిగారూ వై నాట్ ఒపిఎస్' పేరుతో పోరాటానికి సమాయత్తం కావాలని ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్సన్ స్కీమ్ ఎంప్లాయిస్ అసోషియేషన్ (ఎపిసిపిఎస్‌ఇఎ) పిలుపునిచ్చింది. ఇదే నినాదంతో ఒపిఎస్ కోసం సెప్టంబర్ 1న చేపట్టనున్న 'చలో విజయవాడ' పోస్టర్‌ను ఆదివారం ఇక్కడ అసోసియేషన్ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షకార్యదర్శులు రొంగల అప్పలరాజు, కరిమి రాజేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో నాలుగు లక్షల మంది సిపిఎస్ ఉద్యోగులు వున్నారని తెలిపారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దు చేసి ఒపిఎస్ అమల్లోకి తీసుకొస్తామని హామీ ఇచ్చిన జగన్ ..ఆ హామీని అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు దాటినా ఇప్పటికీ అమల్జేయకుండా ఉద్యోగులను మోసం చేశారని విమర్శించారు. ఉద్యోగులను మభ్యపెట్టేందుకు జనరల్ పెన్షన్ స్కీమ్ (జిపిఎస్) అంటూ కొత్త రాగాలు తీస్తున్నారని వాపోయారు. జిపిఎస్‌కు వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు పెడతామంటూ ఉద్యోగ సంఘాల నాయకులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఒపిఎస్ తప్ప ఉద్యోగులకు మరో మార్గం లేదని అన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో సెప్టెంబర్ 1న జరిగే శాంతియుత పోరాటానికి రాష్ట్రంలోని సిపిఎస్ ఉద్యోగులంతా తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎపిసిపిఎస్‌ఇఎ రాష్ట్ర అడిషనల్ జనరల్ సెక్రటరి ఎం రవికుమార్, అసోషియేట్ అధ్యక్షులు ఎంసి రామనర్సింహా తదితరులు పాల్గొన్నారు.










