Apr 04,2023 07:32

అర్ధరాత్రికి ముందే అబద్ధపు కోళ్లు
ఊళ్లేగడం మొదలెడతాయి
తెల్లారేసరికీ తమ గంతల కట్టలోంచి
గేట్ల పైనుండి ఇళ్లల్లోకి గెంతుతూ
లేచినోళ్లను, లేవబోతున్నవాళ్లనూ
తిరిగి జోకొట్టి బజ్జోబెడతాయి
ఒక్కో బుట్టలోంచి ఎగిరి పడుతూ
ఒక్కో రంగు కోడి తన కూతే
వినమని అదే ఘనమని
పోటీ పడి మరీ బురిడీ కొట్టించి
ఎండమావిలోకి ముంచేస్తాయి
అబద్ధాలను గుడ్డిగా నమ్మడమే
నైజంగా పెట్టుకున్న మనం కోళ్లఫారాల
నమ్మకాన్ని వమ్ము చేయం
అడపాదడపా ఏదో మూల నుండి
సన్నగా నిజం ధైర్యం చేసి
గొంతు చించుకుంటున్నా
ఈ కృత్రిమ మిమిక్రీ కోళ్ల
అందమైన అబద్ధాల రెక్కలకు కింద
కట్టి ఉన్న కోడి కత్తి నిజం పీకను
నిర్దాక్షిణ్యంగా తెగేస్తుంది
అవసరానికి ఈ దొంగకోళ్లన్నీ ఏకమై
చీకటి లోంచి చీకట్లను
చీల్చి మేల్కొల్పాల్సిన మనల్ని
తిరిగి చీకటి లోకి నెట్టేసి
అబద్ధాలను పొదుగుతూ
నిజాలను హత్య చేస్తాయి.
 

- డా|| మాటూరి శ్రీనివాస్‌,
సెల్‌ : 9849000037