Jun 03,2023 09:34

హాయ్ సిస్టర్స్‌ అండ్‌ బ్రదర్స్‌ !
నా పేరు జ్ఞానవర్ధన్‌. నా వయస్సు 22 నెలలు. సాధారణంగా ఈ వయస్సులో సరిగ్గా మాటలు కూడా రావు. కాని నాకు మాటలు బాగా వస్తాయి. మా అమ్మ సహకారంతో విజ్ఞానాన్ని పొంది ఎందరినో అబ్బురపరుస్తూ ప్రశంసలు, పురస్కారాలు అందుకున్నా. దాంతో నన్ను అందరూ మెచ్చుకుని అవార్డులు ఇస్తున్నారు. నన్ను చూసి చిచ్చర పిడుగు, బాల మేధావి అంటూ బిరుదులు ఇస్తున్నారు.
          మా అమ్మానాన్న దామర్ల ద్రాక్షసాయి, నీలిమ. మేము మంగళగిరి రాజీవ్‌ గృహకల్ప సమీపంలో సంగారెడ్డి పట్టణం, రెడ్డి కాలనీలో నివాసం ఉంటున్నాం. నాన్నా టాటా సంస్థలో పనిచేస్తున్నారు. మా అమ్మ గతంలో ఉద్యోగం చేసేది. నేను పుట్టాక నన్ను చూసుకుంటూ ఇంట్లోనే ఉంటున్నారు. చిన్నప్పటి నుంచి నాలో తెలివితేటలను గమనించిన అమ్మానాన్నలు నా సృజనాత్మకతను పెంపొందించేందుకు విజ్ఞానదాయకమైన విషయాలను చెబుతూ ఉండేవారు. దీంతో జ్ఞానవర్ధన్‌ పేరుకు తగ్గట్టుగా మా అమ్మ చెప్పిన విషయాలను జ్ఞాపకం ఉంచుకుని తిరిగి అడిగినప్పుడు సమాధానం చెప్పేవాడిని. 21 దేశాలకు సంబంధించిన జాతీయ జెండాలను చూపితే వెంటనే ఆ దేశం పేరు, రాజధానులు సైతం చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచా. 30 మంది శాస్త్రవేత్తలను గుర్తించడమే కాకుండా వారు ఏమి కనుక్కొన్నారో చెబుతున్నా. దేశంలోని రాష్ట్రాల పేర్లు, రాజధానులను చెప్పి, చుట్టుపక్కల జనాలను, అధికారులను ఆకట్టుకున్నా. 30 మంది స్వాతంత్య్ర సమరయోధుల ఫొటోలు చూపిస్తే వారి పేర్లు చెప్పేస్తా. 30 రకాల పూలు, 50 జంతువులు, 20 పక్షులు, 30 వాహనాలు, 20 వృత్తులను గుర్తించి వాటి పేర్లు చెబుతున్నా. దీంతోపాటు తెలుగు, ఆంగ్ల అక్షరాలను చదవడం నేర్చుకున్నా.
          దీంతో అతిచిన్న వయసులో ప్రతిభ చూపుతున్నాడంటూ మీడియా అంకుల్స్‌, ఆంటీస్‌ నా దగ్గరకు వస్తున్నారు. అలా... అలా ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డులో స్థానం దక్కించుకున్నా. వండర్‌ బుక్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ ద్వారా వండర్‌ కిడ్‌గా ప్రశంసలూ అందుకున్నా.
 

- దామర్ల జ్ఞానవర్ధన్‌,
మంగళగిరి, గుంటూరు జిల్లా.