
- ఇఎంఐ వ్యయాల్లో 20% పెరుగుదల
- రెండేళ్లుగా పెరుగుతోన్న వడ్డీ రేట్లు
- పడిపోతున్న అమ్మకాలు
ప్రజాశక్తి - బిజినెస్ డెస్క్ : చౌక గృహాల కొనుగోలుదారులు వడ్డీల భారంతో ఆర్థికంగా చితికిపోతున్నారు. గత రెండేళ్లలో గృహ రుణ రేట్లు పెరగడంతో నెలవారి వాయిదాలు భారీగా చెల్లించాల్సి వస్తోంది. ఈ అధిక రేట్ల పరిణామంపై తక్కువ ఆదాయ రుణ గ్రహీతలు బెంబేలెత్తుతున్నారు. మరోవైపు ఈ విభాగంలో అమ్మకాలు పడిపోతున్నాయి. చౌక లేదా సరసమైన ధరల విభాగంలోకి వచ్చే రూ.30 లక్షల వరకు గృహ రుణాలపై ఫ్లోటింగ్ వడ్డీ రేట్లు 2021లో 6.7 శాతంగా ఉండగా.. ప్రస్తుతం ఈ రేట్లు దాదాపు 9.15 శాతానికి పెరిగాయని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంస్థ ఓ రిపోర్ట్‌లో వెల్లడించింది. దేశంలోని ఏడు ప్రధాన నగరాలను ఈ నివేదికలో అన్‌రాక్ పరిగణలోకి తీసుకుంది. ఆ రిపోర్ట్ వివరాలు.. అధిక వడ్డీ రేట్ల వల్ల చౌక ధరల గృహాల అమ్మకాలు పడిపోతున్నాయి. 2023 ప్రథమార్థం (హెచ్1)లో నివాస అమ్మకాలు 20 శాతం తగ్గాయి. 2022 ఇదే సమయంలో 11 శాతం విక్రయాలు క్షీణించాయి. మొత్తం గృహ అమ్మకాల్లో 2022 ప్రథమార్థంలో 23 శాతం వాటా కలిగిన చౌక గృహాలు.. ఈ ఏడాది ప్రథమార్థంలో 18 శాతానికి తగ్గాయి.
అన్‌రాక్ డాటా ప్రకారం.. భారత్‌లో సరసమైన గృహాలకు అధిక డిమాండ్ ఉంది. ఈ విభాగంలోని చాలా మంది కొనుగోలుదారులు తమ ఇళ్లను కొనుగోలు చేయడానికి బ్యాంకులు లేదా హౌజింగ్ ఫైనాన్స్ కంపెనీలు ఇచ్చే రుణాలపై ఆధారపడతారు. మరోవైపు ఈ మధ్యకాలంలో ఇళ్ల ధరలు కూడా పెరిగాయి. 20 ఏళ్ల కాలపరిమితితో రూ.30 లక్షల గృహ రుణంపై జులై 2021లో ప్రతీనెల రూ.22,700 వాయిదా చెల్లించాల్సి ఉంటే.. ఇప్పుడు ఆ మొత్తం రూ.27,300కు చేరింది. అంటే నెలకు దాదాపు అదనంగా రూ.4,600 భారం పెరిగినట్లయ్యింది. అంతిమంగా వడ్డీ భారం రూ.11 లక్షల వరకు చెల్లించాల్సి రావచ్చని అంచనా. ''ఇఎంఐల భారం 20 శాతం పెరగడంతో అదనంగా దాదాపు రూ.11 లక్షల భారం పడనుంది. 2021లో రూ.24.5 లక్షల వడ్డీ చెల్లించాల్సి ఉండగా.. ఇప్పుడది రూ.35.5 లక్షల మేర చెల్లించాల్సి ఉంటుందని అంచనా.'' అని అన్‌రాక్ గ్రూప్ రీసెర్చ్ హెడ్, రీజినల్ డైరెక్టర్ ప్రశాంత్ ఠాకూర్ పేర్కొన్నారు.
- ఫ్లోటింగ్ వడ్డీ అంటే ఏమిటి?
ఎంచుకున్న రుణం సమయంలో వడ్డీ రేటు మారినప్పుడు ఫ్లోటింగ్ వడ్డీ రేటు. మార్కెట్ రేట్లలో వ్యత్యాసం కారణంగా ఈ మార్పులు సంభవిస్తాయి. దీనిని 'సర్దుబాటు ధరలు' అని కూడా అంటారు. బ్యాంకులు సాధారణంగా తమ ఫ్లోటింగ్ రేట్ హోమ్ లోన్‌లను లింక్ చేయడానికి రెపో రేటును బెంచ్‌మార్క్‌గా ఉపయోగిస్తాయి. అందువల్ల రెపో రేటు పెరుగుదలతో గహ రుణ రేట్లు పెరిగింది. పర్యవసానంగా, బ్యాంకులు గత ఒక సంవత్సరంలో రుణ కాలపరిమితిని లేదా గృహ రుణ సమానమైన నెలవారీ వాయిదాలను (ఇఎంఐ)లను పెంచాయి. గడిచిన రెండేళ్లలో ఆర్‌బిఐ రెపో రేటును 250 బేసిస్ పాయింట్లు పెంచి 4 శాతం నుంచి 6.5 శాతానికి చేర్చింది.