Dec 13,2022 08:02

కసికాలం కలికాలం
ప్రకృతి వికృతిగా రూపుదాల్చుతూ
వికృతపు పోకడలు పోతున్న కాలం
కాయకష్టాన్ని కన్నీరుగా మార్చేస్తూ
గింజను గుంజకు ఉరివేస్తూ
కర్షకుడ్ని అకాలపు కన్నీటి వానల్లో
ముంచేస్తూ గుండెలు తూట్లు పోడిచేస్తూ...

ఆరుగాలం అహరహం
పిడికెడు ముద్ద కోసం
మెతుకు మెతుకు కూడబెట్టి
తను ఓ ముద్ద తిని పది ముద్దలు
పది మందికీ పెట్టాలని
అంగాంగం గాయం చేసుకుంటూ
అశ్రువులను రుధిరంగా చిలికి
పండించుకుంటూ పోతుంటే...

అకాలపు వృష్టిని
ఆ కర్షకరాజు కష్టాన్ని ఏమార్చి
తుపాను రూపంగా మార్చి
తుంపర తుంపర్లను వాడి చినుకుల్జేసి
సమ్మెటపోట్లగా మార్చి
కసిదీరా గుండెలపై కొడుతుంటే
ఆ దెబ్బలకు కుదేలై పోతూ

మంచు ముక్కల్లా విరిగి కరిగిపోతున్న
తమ జీవితాలను నిలబెట్టమని
వర్షంలో కలిసిపోయిన
తమ కన్నీటిని చూసైనా ద్రవించి
పన్నీటి వర్షంగా మార్చి
అశ్రునయనాలతో
తమకు దిక్కుచూపమని
హృదయంలేని పాలకులను
నలుదిక్కులా దీనంగా ప్రార్థిస్తూ కర్షకరేడు !

- నాగముని. యం,
సీనియర్‌ అసిస్టెంట్‌, విద్యుత్‌ శాఖ,
సెల్‌ : 9490856185