
పూణే :వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ జట్టు ప్రారంభంలో వరుసగా నాలుగు మ్యాచుల్లో గెలిచి దాదాపు సెమీస్‌కు చేరువైంది. ఆ తర్వాత ఏమైందో.. గానీ.. కివీస్ జట్టు ఒక్కసారిగా వరుసగా మూడు మ్యాచుల్లో ఓటమిపాలైంది. దీంతో ఆ జట్టు సెమీస్ అవకాశాలపై కారుమబ్బులు కమ్ముకున్నట్లయ్యింది. ఆ జట్టు చివరి రెండు మ్యాచ్‌లను పాకిస్తాన్, శ్రీలంకలతో తలపడాల్సి ఉంది. ఆ జట్టు నేరుగా సెమీస్‌కు చేరాలంటే ఈ రెండు మ్యాచుల్లో ఆ జట్టుకు గెలుపు తప్పనిసరి. మరోవైపు ఆస్ట్రేలియా జట్టు ప్రారంభంలో రెండు మ్యాచుల్లో ఓడినా.. ఆ తర్వాత నాలుగు మ్యాచుల్లో నెగ్గి పాయింట్ల పట్టికలో 4వ స్థానానికి ఎగబాకింది. ఆసీస్ జట్టు ఇంగ్లండ్, ఆఫ్ఘన్, బంగ్లాదేశ్‌లతో తలపడాల్సి ఉంది. ఈ మూడు మ్యాచుల్లో రెండు మ్యాచ్‌లు నెగ్గిన ఆసీస్ సెమీస్‌కు చేరడం ఖాయం. ఇక పాకిస్తాన్ జట్టు విషయానికొస్తే.. ఆ జట్టు ఆడిన 7మ్యాచుల్లో 4 మ్యాచుల్లో ఓడి సెమీస్‌కు చేరడమే కష్టమనుకున్న దశలో మూడు మ్యాచుల్లో గెలిచి.. న్యూజిలాండ్ జట్టు దక్షిణాఫ్రికా చేతిలో ఓటమితో ఆ జట్టూ సెమీస్ రేసులోకి వచ్చింది. న్యూజిలాండ్-పాకిస్తాన్ జట్లమధ్య 4న బెంగళూరులోని చిదంబరం స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. ఆ మ్యాచ్‌లో ఏ జట్టు గెలిస్తే.. సెమీస్ సమీకరణలు మారనున్నాయి. మరోవైపు పసికూన ఆఫ్ఘనిస్తాన్ జట్టూ (నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా) మిగిలిన 3 మ్యాచుల్లో రెండు మ్యాచుల్లో గెలిచినా ఆ జట్టూ సెమీస్ బెర్త్ దక్కనుంది. దీంతో రాబోయే మ్యాచ్‌లు హోరాహోరీగా సాగడం ఖాయంగా కనబడుతోంది.