Sep 24,2022 10:02
  • భారీగా భూములు కోల్పోనున్న రైతులు
  • ప్రభుత్వానికి పెరగనున్న అంచనా వ్యయం

ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి : భూస్వాములు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, రాజకీయ నాయకుల ప్రయోజనాలకు అనుగుణంగా సుజల స్రవంతి కాలువ డిజైన్‌లో మార్పులు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాలువ డిజైన్‌కు, పాతిన హద్దురాళ్లకు మధ్య తీవ్ర వ్యత్యాసం కనిపిస్తోంది. దీనివల్ల ప్రభుత్వ అంచనా వ్యయం, భూమి కోల్పోయే రైతుల సంఖ్య కూడా భారీగా పెరగనుంది. ఈ నేపథ్యంలో రైతులు, ఎపి రైతు సంఘం నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెలరోజుల క్రితం ఎపి రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు రైతులు తమ సమస్యలను ఏకరువుపెట్టారు.
        విజయనగరం జిల్లాలో 3.94 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో బాబూ జగ్జీవన్‌ రామ్‌ సుజల స్రవంతి కాలువ నిర్మాణానికి భూములు సేకరిస్తున్నారు. ఎస్‌.కోట, గజపతినగరం, చీపురుపల్లి, నెల్లిమర్ల నియోజకవర్గాల పరిధిలో సుమారు 4,500 ఎకరాలు సేకరించాల్సి ఉంది. ఈ ప్రాంతంలో ఇప్పటికే తోటపల్లి, తారకరామ తీర్థసాగర్‌ కాలువలు ఉన్న నేపథ్యంలో స్వల్ప మార్పుల ద్వారా ప్రభుత్వ పెట్టుబడిని తగ్గించవచ్చని, ప్రత్యామ్నాయ ఆయుకట్టుకు కూడా నీరందించే విషయాన్ని పరిశీలించాలని రైతులు, రైతు సంఘం నాయకులు చేస్తున్న విజ్ఞప్తులపై ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. మరోవైపు భూస్వాములు, రాజకీయ నాయకుల ప్రయోజనాల కోసం కాలువ డిజైన్‌ సాగదీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. గజపతినగరం, గుర్ల, బొండపల్లి, ఎస్‌.కోట తదితర మండలాల్లో డిజైన్‌ను పక్కనబెట్టి హద్దురాళ్లు పాతారన్నది ఆయా ప్రాంతాల రైతులు, ఎపి రైతుసంఘం నాయకులు చెబుతున్నారు.
 

                                                           మలుపులు తిప్పేందుకు యత్నాలు

గుర్ల మండలం కొండగండ్రేడు వద్ద ఓ భూస్వామికి చెందిన తోట, పంట పొలం తప్పించేందుకు పై భాగం నుంచి హద్దురాళ్లతో మార్కింగ్‌ చేశారు. గజపతినగరం మండలం ఎస్‌జిఆర్‌ పురం నుంచి సమాంతరంగా వెళ్లాల్సిన కాలువ డిజైన్‌ను సమీపంలోవున్న ఒక రాజకీయ నేతకు చెందిన అయ్యప్ప లేఅవుట్‌ను తప్పించడం కోసం మలుపు తిప్పారు. ఇదే నియోజకవర్గంలోని బొండపల్లి చెరువు వద్ద, బొండపల్లి మండలం ఎడ్లపాలెం - గుమడం గ్రామాల మధ్య మరో బడాబాబు ప్రయోజనం కోసం అశాస్త్రీయంగా మలుపు తిప్పేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎస్‌.కోట మండలం శివంరాజుపేట గ్రామం వద్ద వివేకానందా హాస్టల్‌ బిల్డింగ్‌ను తప్పించేందుకు కాలువను ఒంపులు తిప్పేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో రైతులు సర్వేలకు వచ్చిన అధికారులను, సిబ్బందిని ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. 1000 ఎకరాలకు ప్రభుత్వం ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ విడుదల చేసినప్పటికీ గ్రామాల్లో రైతులు ఒప్పుకోవడం లేదు. రాజకీయ నాయకులు, భూస్వాముల ప్రయోజనాల కోసం డిజైన్‌లో మార్పులు చేస్తే తమ బతుకుల సంగతేంటని రైతులు ప్రశ్నిస్తున్నారు.
 

                                                                రైతులకు నష్టం చేకూరిస్తే ఊరుకోం

గజపతినగరం, గుర్ల మండలాల్లో తోటపల్లి గజపతినగరం బ్రాంచి కెనాల్‌, రామతీర్థసాగర్‌ కాలువలకు ఆనుకుని సుజల స్రవంతి కాలువ డిజైన్‌ ఉంది. ఇన్ని కాలువల ద్వారా ఒకే ప్రాంతానికి నీరందించి వృథా చేసే కన్నా ప్రత్యామ్నాయ ఆయుకట్టుకు నీరందించాలన్నది మా అభిప్రాయం. లేదా గజపతినగరం బ్రాంచి కెనాల్‌కు సుజల స్రవంతి కాలువను అనుసంధానం చేసే అంశాన్ని పరిశీ లించాలి. ప్రభుత్వానికి వ్యయభారం కూడా తగ్గించుకోవచ్చు. లేదంటే ప్రభుత్వానికి ఆర్థిక భారంతోపాటు రైతులకు జరిగే ప్రయోజనం కన్నా నష్టం ఎక్కువగా ఉంటుంది. బుద్ధరాజు రాంబాబు, ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి