Jun 23,2023 10:08

హైదరాబాదులో వైద్యునిగా సేవలు అందిస్తున్న ప్రశాంత్‌ వేసవి సెలవుల్లో తన సొంత గ్రామానికి వచ్చాడు. ఊరిలో అడుగుపెట్టగానే ఎక్కడపడితే అక్కడ చెత్త కుప్పలు, ప్లాస్టిక్‌ కవర్లు దర్శనమిచ్చాయి. కొంతమంది రోడ్డు పక్కన మల విసర్జన చేస్తూ కనిపించారు. ఎక్కడా చెట్లు లేవు. ఇది తన ఊరేనా! అనే అనుమానం వచ్చింది. ఇలా ఏవేవో ఆలోచనలతో ఇంటికి చేరుకున్నాడు. ప్రయాణం చేసి అలసిపోయిన ప్రశాంత్‌ భోజనం చేసి పడుకున్నాడు. కానీ నిద్ర పట్టలేదు. పచ్చని చెట్లతో కడిగిన ముత్యంలా ఉండే ఒకప్పటి తన ఊరు ఇలా కలుషితమైందనే బాధ మనసును తొలిచింది. ఏ విధంగానైనా తన ఊరును బాగుపరిచి పర్యావరణ సహితంగా మార్చాలి అనుకున్నాడు. మరుసటి రోజు గ్రామస్తులతో, పెద్దలు, ప్రజాప్రతినిధులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశాడు.
        'మీరందరూ కూడా నాకు మూడు హామీలు ఇవ్వాలి. అలా చేస్తామంటేనే నేను ఉచితంగా మందులు ఇస్తా, వైద్య సేవ చేస్తా' అని ప్రశాంత్‌ అన్నాడు.
         'డాక్టర్‌ గారూ! మీరు ఏదీ చేసినా ఊరి ప్రజలకు మంచి చేస్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో వైద్యం అందడం కష్టం. అది మీరు మాకు ఉచితంగా అందిస్తామన్నారు. కాబట్టి మేమంతా మీకు హామీ ఇస్తున్నాం.' ముక్త కంఠంతో అన్నారు గ్రామస్తులంతా.
         'మొదటిది మీరందరూ ప్రతి ఇంటికి మరుగుదొడ్డి కట్టుకోవాలి. ఆరుబయట ఎవరూ మలవిసర్జన చేయకూడదు. రెండవది ప్లాస్టిక్‌ కవర్లు వాడకూడదు. మూడవది ఎక్కడ ఖాళీ ప్రదేశం కనిపించినా అక్కడ అందరూ కలిసి చెట్లను నాటాలి' అని అన్నాడు.
         గ్రామస్తులు అందరూ సరేనని హామీ ఇచ్చారు. ఊరిలో ఉన్న చెత్తను తొలగించారు. ఇంటి ముందు మరుగుదొడ్లు నిర్మించుకున్నారు. ఊరి బయట కొన్ని మరుగుదొడ్లు కట్టారు. రోడ్లకు ఇరువైపులా, ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటారు. బాధ్యతగా ప్రతి రోజూ వాటికి నీళ్లు పోసి పెంచారు. కొద్ది నెలల్లోనే తన గ్రామం చక్కటి పర్యావరణంతో విలసిల్లింది. ఆరు నెలల తర్వాత డాక్టర్‌ ప్రశాంత్‌ ఊరికి వచ్చారు. గ్రామంలో వచ్చిన మార్పుకు సంతోషించారు. తను మాట ఇచ్చినట్టుగానే ప్రతి నెలా ఊరిలో వైద్యశిబిరం నిర్వహించి, అవసరమైన వారికి మందులు ఇవ్వసాగారు.
 

- యాడవరం చంద్రకాంత్‌ గౌడ్‌
94417 62105