Jul 15,2023 08:09
  • మొదటి మూడు దశలు వంద శాతం సక్సెస్‌
  • రాష్ట్రపతి ప్రధాని ప్రభృతుల అభినందనలు
  • ఇస్రో దృష్టంతా ఆగస్టు23న సాఫ్ట్‌ ల్యాండింగ్‌పైనే

ప్రజాశక్తి-సూళ్లూరుపేట, బెంగళూరు : అంతరిక్ష రంగంలో భారత్‌ కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. శుక్రవారం మధ్యాహ్నం సరిగ్గా 2.35 గంటలకు తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ధావన్‌ అంతరిక్ష పరిశోధనా కేంద్రం నుంచి చంద్రయాన్‌-3 ల్యాండర్‌ను మోసుకుని నిర్దిష్ట భూ కక్ష్యలోకి దూసుకెళ్లింది. మొదటి మూడు దశలను రాకెట్‌ నూటికి నూరు శాతం సమర్థవంతంగా అధిగమించిందని చంద్రయాన్‌-3 ప్రాజెక్టు డైరక్టర్‌ పి వీరముత్తే వేల్‌ తెలిపారు. అన్నీ అనుకున్న ప్రకారం జరిగితే 42 రోజుల పాటు అంతరిక్ష యాత్ర సాగించి ఆగస్టు 23న సాయంత్రం గం.5.17 ని.లకు చంద్రుని దక్షిణ ధ్రువానికి చేరువలో సుమారు 70 డిగ్రీల దక్షిణ అక్షాంశం వద్ద ల్యాండింగ్‌ అవుతుంది. చంద్రయాన్‌- 2 చివరి అంకంలో కీలకమైన ల్యాండింగ్‌ వద్దే కుప్పకూలింది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఈ సారి చంద్రయాన్‌-3 ల్యాండర్‌కు అమర్చిన స్టాండ్‌ను శక్తివంతమైన రాడ్స్‌తో తయారు చేశారు. ఇస్రో దృష్టంతా ఇప్పుడు చంద్రయాన్‌-3 సాఫ్ట్‌ ల్యాండింగ్‌ పైనే ఉంది. ఈ ఆఖరి ఘట్టం విజయవంతమైతే చంద్రమండలంపైకి రోవర్‌ను పంపిన అమెరికా, రష్యా, చైనాల సరసన భారత్‌ నిలుస్తుంది. చంద్రునికిపైకి రోవర్‌ పంపేందుకు అమెరికాకు నాలుగు రోజులు పడితే, రష్యాకు ఒకటిన్నర రోజే పట్టింది. భారత్‌కు మాత్రం 42 రోజులు పడుతుంది. ఎందుకంటే మనం ఉపయోగించే రాకెట్‌ అమెరికా, రష్యా అంత శక్తివంతమైనది కాదు. అమెరికా, రష్యా దేశాలు ఇప్పటికే చంద్రమండలంపైకి మానవ వ్యోమగాములను కూడా పంపాయి. భూమికి 3.84 లక్షల కి.మీ దూరంలో ఉన్న చంద్రునిపైకి నేరుగా వెళ్లాలంటే శక్తివంతమైన రాకెట్‌ అవసరం. అటువంటి సామర్థ్యం లేనందున ఎల్‌విఎం3 ఎం4 రాకెట్‌ సాయంతో తక్కువ ఖర్చుతో చంద్రయాన్‌-3 ప్రాజెక్టుకు రూపకల్పన జరిగింది.
          తొలుత భూమి చుట్టూ దీర్ఘ వృత్తాకారంలో ఉన్న కక్ష్యలో ప్రవేశించి 24 రోజుల పాటు అందులోనే చక్కర్లు కొడుతూ, క్రమంగా తన కక్ష్యను పెంచుకుంటూ చంద్రుని గురుత్వాకర్షణ క్షేత్రంలోకి చేరుతుంది. ఈ ప్రక్రియ అంతా పూర్తి కావడానికి 42 రోజులు పడుతుంది. 2008లో ఇస్రో నిర్వహించిన చంద్రయాన్‌-1 విజయవంతమైనా, 2019లో చంద్రయాన్‌-2 చివరి నిమిషంలో విఫలమైంది. ఇస్రో చైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ బుధవారం నుంచీ షార్‌లోనే ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తలతో సమీక్షించారు. చంద్రున్ని లోతుగా అధ్యయనం చేసి, అక్కడ దాగున్న అనేకానేక రహస్యాలను వెలికి తీయడమే చంద్రయాన్‌-3 ప్రయోగం ప్రధాన లక్ష్యం. ఇప్పటి దాకా ఎన్నో దేశాలు చంద్రునికి ముందు వైపు అంటే ఉత్తర ధ్రువంపై పరిశోధనలు చేశాయి. భారత్‌ మాత్రం చంద్రయాన్‌-1 నుంచి తాజా చంద్రయాన్‌-3 వరకూ చంద్రుని వెనుక వైపు, అంటే దక్షిణ ధ్రువాన్ని పరిశోధించేందుకే ప్రయత్నిస్తూ వస్తోంది. అందులో భాగంగా చంద్రయాన్‌-3 ల్యాండర్‌ను సూర్యరశ్మి పడని చంద్రుని దక్షిణ ధ్రువపు చీకటి ప్రాంతంలో దించనున్నట్లు తెలిపారు.
           చంద్రయాన్‌-3 ప్రయోగం విజయం సాధించడంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధనకర్‌, ప్రధానమంత్రి మోడీ శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. భారత అంతరిక్ష చరిత్రలో ఇది ఒక కొత్త అధ్యాయమని మోడీ ట్వీట్‌ చేశారు. సిపిఎం ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ప్రయోగం విజయవంతంపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ స్పందిస్తూ ఇది దేశానికి చారిత్రాత్మక విజయమని అభివర్ణించారు. ఈ విజయం దేశంలో ప్రజలందరికీ గర్వకారణమైన క్షణమని, అంతరిక్ష పరిశోధనలో ఈ మిషన్‌ సంచలనాత్మక ఫలితాలను తెస్తుందని విజయన్‌ ట్వీట్‌ చేశారు. అలాగే, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, కాంగ్రెస్‌ నాయకులు రాహుల్‌గాంధీ తదితరులు అభినందనలు తెలిపారు. చంద్రయాన్‌-3 బరువు 3,920 కిలోలు. ఇందులో ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ 2,145 కిలోలు, ల్యాండర్‌ 1,749 కిలోలు, రోవర్‌ 26 కిలోలుంటాయి. చంద్రయాన్‌-2లో 14 పేలోడ్స్‌ పంపగా చంద్రయాన్‌-3లో 5 ఇస్రో పేలోడ్స్‌ మాత్రమే పంపారు. చంద్రయాన్‌-3 ప్రపొల్షన్‌ మాడ్యూల్‌, ల్యాండర్‌, రోవర్లలో అత్యాధునిక సాంకేతిక పరికరాలను అమర్చి పంపారు.
         చంద్రయాన్‌ 2 ప్రయోగం విజయవంతమైన సందర్భంగా గూడూరు పట్టణంలోని సాయి విద్యానికేతన్‌ పాఠశాల విద్యార్థులు 'ఆల్‌ది బెస్ట్‌ ఇస్రో' అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు.
 

                                                               గవర్నర్‌ నజీర్‌, సిఎం జగన్‌ హర్షం

చంద్రయాన్‌-3 విజయవంతం కావడం పట్ల రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌ అబ్దుల్‌ నజీర్‌, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, టిడిపి అధ్యక్షులు చంద్రబాబునాయుడు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు దగ్గుపాటి పురంధరేశ్వరి హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. చంద్రునిపై ఎటువంటి ఆటంకాలూ లేకుండా ల్యాండ్‌ కావాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.