
బెంగళూరు : చంద్రునిపై పరిశోధనల కోసం ఇస్రో పంపిన చంద్రయాన్‌ా3ను శనివారం రాత్రి 7గంటల సమయంలో చంద్రుని కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. ఇక్కడి మిషన్ ఆపరేషన్స్ కాంప్లెక్స్ (ఎంఓఎక్స్) నుండి ఈ మేరకు ఆదేశాలను పంపినట్లు ఇస్రో తెలిపింది. ఈ మేరకు ఎక్స్ (పూర్వపు ట్విట్టర్)లో పోస్టు చేసింది. ఇక తదుపరి ఆపరేషన్ కక్ష్యను కుదించడం. ఈ ప్రక్రియను ఆదివారం రాత్రి 11గంటల సమయంలో చేపట్టనున్నారు.జులై 14న ఇస్రో చంద్రయాన్‌ా3ని ప్రయోగించింది. మూడింట రెండొంతుల దూరాన్ని చంద్రయాన్ పూర్తి చేసిందని శుక్రవారం ఇస్రో ప్రకటించింది. గత మూడు వారాల్లో ఐదు ఆపరేషన్లు చేపట్టి భూమికి దూరంగా చంద్రయాన్‌ా3 అంతరిక్ష నౌకను పయనించేలా చేశారు. ఆ తర్వాత ఆగస్టు 1వ తేదిన కీలకమైన సింగిల్ షాట్ మూవ్‌ను అమలు చేసి భూ కక్ష్య నుండి చంద్రుని దిశగా కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. ఇక ఆ తర్వాత భూ కక్ష్యకు దూరంగా జరిగిన అంతరిక్ష నౌక చంద్రుని కక్ష్యకు సమీపంగా పయనించడం ఆరంభించింది. శనివారం మరో కీలకమైన ప్రక్రియలో చంద్రుని కక్ష్యలోకి రోదసీ నౌకను ప్రవేశపెట్టారు.ప్రస్తుతం రోదసీ నౌక పరిస్థితి సాధారణంగానే వుందని, ఆగస్టు 23న చంద్రుని ఉపరితలంపై సజావుగా దిగేందుకు ప్రయత్నిస్తామని ఇస్రో గతంలో తెలిపింది. ఒక వారం రోజుల తర్వాత ల్యాండింగ్ కూడా సాఫీగా జరుగుతుందని, ఆందోళన చెందే పనే లేదని కేంద్ర సైన్స్, సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ పేర్కొన్నారు.