ప్రజాశక్తి-అమరావతి :స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన ప్రధాన బెయిల్ పిటిషన్, మధ్యంతర బెయిల్ అనుబంధ పిటిషన్ల విచారణ నుంచి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప్ తప్పుకున్నారు. దసరా సెలవుల ప్రత్యేక బెంచ్ (వెకేషన్ కోర్టు బెంచ్) ఎదుట శుక్రవారం ఆ పిటిషన్లు విచారణకు వచ్చాయి. ఈ పిటిషన్లలో వకాలత్ వేసిన న్యాయవాది, ఒక న్యాయాధికారి భర్త అని, ఆ న్యాయవాది దాఖలు చేసిన కేసులను తను విచారించలేనని జస్టిస్ ప్రకటించారు. నాట్ బిఫోర్ మీ అంటూ ఇంతకుమించి తానేమీ చెప్పలేనన్నారు. మనస్సాక్షి అంగీకరించడం లేదన్నారు. పిటిషనరు చంద్రబాబు అనారోగ్య పరిస్థితులను వివరిస్తూ దాఖలు చేసిన పిటిషన్లను చీఫ్ జస్టిస్ ఎదుట ఉంచాలని, ఈ నెల 30న విచారణకు వచ్చేలా తగిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించారు.
సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్ కల్పించుకుని, చంద్రబాబు అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా అత్యవసర విచారణకు వీలుగా రిజిస్ట్రీకి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ నెల 30లోపే అత్యవసర విచారణకు అనుమతించేలా హైకోర్టు జ్యుడీషియల్ రిజిస్ట్రార్‌ను కోరతామని, ఉత్తర్వుల్లో ఈ నెల 30.. అని లేకుండా సవరణ చేయాలని కోరారు. ఉత్తర్వుల్లో ఈ నెల 30న.. అని ఉంటే తాము రిజిస్ట్రార్‌ను అభ్యర్థించేందుకు అవరోధం ఏర్పడుతుందని చెప్పారు. రూల్స్ ప్రకారం పిటిషన్‌ను తగిన బెంచ్‌కు పోస్ట్ చేసేందుకు తామిచ్చిన ఉత్తర్వులు అడ్డంకి కాబోదని న్యాయమూర్తి స్పష్టం చేశారు.