
చందమామ రావే
జాబిల్లి రావే
రాకెట్టెక్కి రావే
రహస్యాలు చెప్పవే ...
దుమ్ము ధూళి గున్నవా
ఎగుడు దిగుడుగున్నవా
నీ వింతవింతలన్ని
విక్రంతోని చెప్పవే
నీటి జాడ ఉన్నదా
వాతావరణమున్నదా
కొత్త కొత్త విశేషాలు
మట్టి పంపి చెప్పవే
ఆ వెండి కొండల్లో
ఏ ఖనిజముంది
నీ గర్భమందున
ఏముంది చెప్పవే
వెండి వెన్నెలెందుకు
అమాస పున్నమెందుకు
భూమి ప్రదక్షిణెందుకు
చందమామ చెప్పవే
మేమక్కడొచ్చి
నివసించవచ్చా
వెన్నెల మామతో
ఆటలాడవచ్చా
చెప్పవే చెప్పవే
జాబిల్లి చెప్పవే
రాకెట్ పైన వచ్చి
వివరంగ చెప్పవే
- ఆవుల చక్రపాణి యాదవ్