Aug 27,2023 06:31

అడవిలో ఒక పెద్ద మర్రిచెట్టు ఉంది. ఒక రోజున ఓ ఏనుగు మేత మేసుకుంటూ విశ్రాంతి కోసం ఆ చెట్టు కిందికి వచ్చింది. 'అబ్బా! భలే చల్లగా ఉంది ఈ చెట్టు నీడ' అనుకుంటూ అక్కడే కాసేపు విశ్రమించింది. కాసేపటికి ఎగురుతూ దుంకుతూ ఓ బడాయి కోతి కిచకిచమంటూ అక్కడకి చేరింది. హాయిగా నిద్రపోతున్న ఏనుగు, ఆ చప్పుడుకు చటుక్కున లేచింది.
లేవటంతోనే.. 'నువ్వు ఇక్కడ ఉండడానికి వీలు లేదు. వెంటనే వెళ్లిపో..' అంది. 'ఎందుకు వెళ్లాలి? ఇది నీ చెట్టా'' అని కోతి వెకిలి నవ్వు నవ్వుతూ అంది. 'నేనే మొదట వచ్చాను. కాబట్టి ఈ చెట్టు నాదే' అని ఏనుగు గంభీరంగా అంది.
'చెట్టుమీద మర్రి పండ్లు నువ్వు చూడలేదా? అవి తినుకుంటూ చిటారు కొమ్మన నీకంటే ముందే నేను ఇక్కడికి చేరుకున్నా. కాబట్టి ఈ చెట్టు నాదే' అని కోతి ఏనుగుతో చెప్పింది. కోతి మాటలకు ఏనుగుకు బాగా కోపం వచ్చింది. ఇంతలో ఓ కుందేలు అక్కడికి వచ్చింది. చెట్టు గురించి ఏనుగు, కోతి వాదులాడుకోవడం చూసింది. 'మీ గొడవ ఇక ఆపుతారా.., ఈ మర్రిచెట్టు మీ ఇద్దరిదీ కాదు. నాది' అని గట్టిగా చెప్పింది.
కుందేలు మాటలకు ఆ రెండు నివ్వెరపోయాయి. తరువాత తేరుకుని 'ఇంత పెద్ద వృక్షం నీదెట్లా? అవుతుందని' ప్రశ్నించాయి. అప్పుడు కుందేలు 'మా తాత ఇక్కడికి వచ్చినప్పుడు ఈ చెట్టుకు కొమ్మలు లేవు. ఊడల్లేవు. పండ్లు అంతకన్నా లేవు. చిన్న మొక్కగా ఉంది. మా పూర్వీకులు అందరూ ఇక్కడే ఆడుకునేవారు. మా వాళ్లే ముందు చూశారు కాబట్టి ఈ చెట్టు నాదే అవుతుంద'ని చెప్పింది. ఇలా ఈ ముగ్గురు గొడవపడుతుండగా చెట్టుపై నుండి ఓ పక్షి, కిందకి దిగి, 'ఈ చెట్టు మీదెవరిదీ కాదు.. నాది.. నేను వేసిన రెట్టలోని గింజ వల్ల మొక్క మొలిచి, ఇంత పెద్ద చెట్టు అయ్యింది. అయినా నేనెప్పుడూ ఈ చెట్టు నాదని చెప్పలేదు. దీనిమీద ఎన్నో పక్షులు గూళ్లు ఏర్పరచుకున్నాయి. నీడ నిచ్చే చెట్టు అందరిదీ..' అంది. ఏనుగు, కోతి, కుందేలు తమ తప్పు తెలుసుకున్నాయి. ఇంకెప్పుడూ అలా ప్రవర్తించబోమని పక్షితో అన్నాయి.

- కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి,
94415 61655.