Oct 08,2022 10:14

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : అనునిత్యం రాష్ట్ర వ్యవహారాలపై నిఘా పెడుతున్న కేంద్రం... తాజాగా మరిన్ని అరశాలపై ఆరా తీస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్ర పథకాల అమలు, రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు... ఇలా అనేక అంశాలపై కేంద్రం మరోసారి ప్రశ్నావళి సంధించింది. గతంలో అప్పులపై ప్రశ్నలు సంధించిన కేంద్రం ఈసారి మరింత లోతుగా ప్రశ్నించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ మేరకు తాజాగా ఆర్థికశాఖకు తన ప్రశ్నావళి పంపించడం, త్వరగా సమాధానాలు పంపించాలని నిర్దేశించడం గమనార్హం. రెవెన్యూ వ్యయం గణనీయంగా పెరిగిపోయి, పెట్టుబడి వ్యయం లేని నేపథ్యంలో ఆ అంశాలను కూడా ప్రశ్నావళిలో పొందుపంచడం విశేషం. రాష్ట్రంలో పాలనకు, పథకాల అమలుకు సంబంధించి నిధులను ఏయే బ్యాంకుల్లో నిల్వ ఉంచారన్నది చెప్పాలని, గ్రామ స్థాయి నుంచి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు, స్థానిక సంస్థల వారీ వివరాలు అందించాలని నిర్దేశించింది. కేంద్రం నేరుగా అమలు చేసే, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అమలు చేసే పథకాలకు సంబంధించిన నిధుల వివరాలు కూడా సమర్పించాలని కోరింది. ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించేందుకు గానూ ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు, సబ్సిడీలు, ప్రోత్సాహకాల వివరాలను గత ఐదేళ్లకు సంబంధించి సమర్పించాలని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు తీసుకున్న రుణాలు ఏమిటని ప్రశ్నించింది. ఈ వివరాలను పబ్లిక్‌ డొమైన్‌లో ప్రదర్శించారా అన్నది కూడా చెప్పాలని కోరింది. తమకు కూడా ఈ వివరాలను సమర్పించాలని ప్రశ్నావళిలో పేర్కొంది. విద్యుత్‌ రంగంలో సంస్కరణలను ఎలా అమలు చేస్తున్నారన్నదానిపైనా ప్రశ్నించింది. వీటిని కూడా ఐదేళ్లకు సంబంధించి చెప్పాలని కోరింది.

                                                                    ఆస్తుల కల్పన సంగతేంటి ?

రాష్ట్రంలో ఆస్తుల కల్పనకు తీసుకుంటున్న చర్యలపైనా ఆరా తీసింది. గత ఐదేళ్ల కాలంలో ఆస్తుల కల్పన, వాటి నిర్వహణకు బడ్జెట్‌లో కేటాయించిన నిధుల వివరాలను పంపాలని పేర్కొంది. పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థలకు సంబంధించిన వివరాలు కూడా కోరడం విశేషం. 2018-19 నుంచి 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వివరాలు చెప్పాలని పేర్కొంది.
 

                                                                            కేంద్ర పథకాలపైనా..

రాష్ట్రంలో అమలు చేస్తున్న కేంద్ర పథకాల నిర్వహణపైనా వివరాలు కోరింది. కేంద్రం అమలు చేస్తున్న పథకాలు, వాటికి కేంద్రం ఇచ్చిన నిధులు, రాష్ట్ర వాటా నిధులు, ఈ పథకాలను నిర్వహిస్తున్న ప్రభుత్వ సంస్థ, నిధులను నిల్వచేసిన సింగిల్‌ నోడల్‌ ఏజెన్సీ బ్యాంకు పేరు, సెప్టెంబరు వరకు వచ్చిన నిధుల వివరాలు కూడా చెప్పాలని నిర్దేశించింది.