Aug 01,2023 20:39

ప్రజాశక్తి - ఉక్కునగరం : వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వ ఆలోచన మారాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కో-కన్వీనర్‌ నీరుకొండ రామచంద్రరావు అన్నారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మంగళవారానికి 901వ రోజుకు చేరుకున్నాయి. దీక్షల్లో స్టీల్‌ప్లాంట్‌ డబ్ల్యుఎండి, యుటిలిటిస్‌, అడ్మిన్‌, టౌన్‌ అడ్మిన్‌, టిటిఐ విభాగాల కార్మికులు కూర్చున్నారు. వారినుద్దేశించి ఆయన మాట్లాడుతూ..స్టీల్‌ప్లాంట్‌ లాభాల్లోకి రావాలంటే ముందుగా అందుకు సంబంధించిన వనరులను సమకూర్చాలని కోరారు. ఉక్కు ఉత్పత్తికి కేంద్ర ప్రభుత్వం అనేక ఆటంకాలు కలిగిస్తోందన్నారు. బ్లాస్ట్‌ ఫర్నేస్‌లు పనిచేయకుండా చేయడం, ముడి సరుకు రాకుండా అడ్డుకోవడం వంటి చర్యలకు తెగబడుతోందని విమర్శించారు. ప్రజలు అంతా గమనిస్తున్నారని, రానున్న కాలంలో మోడీ సర్కారుకు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ప్లాంట్‌ను కాపాడుకునేందుకు ప్రాణ త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కార్యక్రమంలో పోరాట కమిట చైర్మన్‌ డి.ఆదినారాయణ, నాయకులు వరసాల శ్రీనివాసరావు, రాధోడ్‌, సత్యనారాయణ, పిఎస్‌ఎన్‌.మూర్తి, బాలస్వామి, కృష్ణారావు, కారు రమణ, పల్లం గోపి పాల్గొన్నారు.