
- ఈనెల 30 నుంచి దశలవారికి వారి ఆందోళనకు పిలుపు
ప్రజాశక్తి-భీమవరం(పశ్చిమగోదావరి) : ధరలు అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఇప్పటికైనా ధరల అరికట్టాలని లేనిపక్షంలో ప్రజాగ్రహానికి గురికాక తప్పదని సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం ప్రభుత్వాలను హెచ్చరించారు. బుధవారం సిపిఎం భీమవరం పట్టణం కమిటీ, ముఖ్యులు సమావేశం టౌన్ నాయకులు ఎం. వైకుంఠరావు అధ్యక్షతన సిపిఎం కార్యాలయంలో నిర్వహిచారు. ఈ సందర్భంగా బలరాం మాట్లాడాతూ.. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. వీటితోపాటు విద్యుత్ సంస్కరణలు ద్వారా కరెంట్ చార్జీలు పెంచారని విమర్శించారు. పెద్దపెద్ద కార్పొరేట్ శక్తులకు రుణాలు మాఫీ చేస్తూ పేద మద్యతరగతి ప్రజలపై జిఎస్టి పేరుతో లక్షల కోట్ల రూపాయలు బారాలు వేస్తున్నారని విమర్శించారు. ఉపాధి లేక పెరిగిన ధరలు తట్టుకోలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెంటనే ఉపాధి చూపించి అధిక ధరలు అరికట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి అవకాశాలు పెంచే చర్యలు చేపట్టలేదని విమర్శించారు. విపరీతంగా కరెంట్ చార్జీలు, వివిదరకాలపన్నులు బారాలు వేచారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణలకు రాష్ట్రం నిలయంగా మారిందని దీని ద్వారా ప్రజలపై విపరీతమైన కరెంట్ చార్జీలు పెరిగాయని మండిపడ్డారు. ఒక ప్రక్క కరెంటు కోతలు మరోపక్క అదనపు చార్జీల ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈనెల 30 తేదీ నుంచి సెప్టెంబరు 5 వరకు అధిక ధరలు నిరుద్యోగంపై దశల వారి ఆందోళనకు సిపిఎం పిలుపునిచ్చిందని ఈ పిలుపులో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. సచివాలయం దగ్గర తహశీల్దార్ కార్యాలయాలు ఎదుట జరిగే ధర్నాలలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన తెలియజేయాలని కోరారు. ఈ సమావేశంలో సిపిఎం భీమవరం పట్టణ కార్యదర్శి బి వాసుదేవరావు నాయకులు డి నాగేశ్వరరావు, కే.కృష్ణ, బీ.చైతన్ ప్రసాద్, బి.త్రిమూర్తులు, బంగారు వరలక్ష్మి , నీలాపు అప్పన్న పాల్గొన్నారు.