Sep 17,2022 08:24

  • పోలవరం నిర్వాసితులకు ప్రాణ సంకటం

అనేక విభజన హామీలలాగానే పోలవరం ప్రాజెక్టుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం గ్రహణం పట్టించింది. పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో జాతీయ ప్రాజెక్టు అని స్పష్టంగా పేర్కొన్నా, అవసరమైన నిధుల విడుదలకు మోకాలడ్డుతోంది. ప్రాజెక్టుకోసం సర్వస్వాన్ని త్యాగం చేసే నిర్వాసితులకు పునరావాసం తన బాధ్యత కాదంటోంది. బాధిత ప్రజానీకం పదేపదే విజ్ఞప్తులు చేసినా, దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లి నిరసన గళం వినిపించినా నామమాత్రంగా కూడా స్పందించని ఘనత మోడీ సర్కారుది! ఈ వైఖరి పోలవరం ప్రాజెక్టుకు శాపంగానూ, నిర్వాసితులకు ప్రాణసంకటంగానూ మారింది.

Centers-attack-on- Jeevanadi



ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టం సెక్షన్‌ 90లో పోలవరం ప్రాజెక్టు గురించి ప్రస్తావించారు. జాతీయ ప్రాజెక్టుగా పగిరణించాలని స్పష్టంగా పేర్కొన్నారు. దీనర్ధం ఏమిటి? ప్రాజెక్టు నిర్మాణాన్ని కేంద్రం చేపట్టాలనే కదా ! నిర్మాణం చేపట్టాలంటే ప్రాజెక్టుకు అవసరమైన భూమిని సేకరించి, నిర్వాసితులకు అవసరమైన పునరావాస పనులు పూర్తి చేయాలి. మోడీ ప్రభుత్వం అందుకు భిన్నంగా రాష్ట్రం కోరిందన్న సాకుతో నిర్మాణ బాధ్యతల నుండి తప్పుకుంది. నిర్వాసితుల పునరావాస బాధ్యత తనది కాదంటోంది. అదే సమయంలో నిధుల విడుదల లోనూ పెద్దఎత్తున కోత పెట్టింది. సవరించిన అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడానికి 55,656 కోట్ల రూపాయలు అవసరమవుతాయి. ఈ అంచనాలను 2017, 18 సంవత్సరాల్లోనే రివైజ్డ్‌ ఎస్టిమేషన్‌ కమిటీ, టెక్నికల్‌ అడ్వైజరీ కమిటీలతో పాటు సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ కూడా ఆమోదించింది. మోడీ ప్రభుత్వం అందుకు సిద్ధపడటం లేదు. 2013-14 నాటి అంచనా 28,919 కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేస్తామంటోంది. నిజానికి 2014 మే 29న జరిగిన క్యాబినెట్‌ సమావేశంలో భవిష్యత్‌లో ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పెరిగినా కేంద్ర ప్రభుత్వమే భరించాలని నిర్ణయించారు. 2017 మే 8న కేంద్ర జలశక్తి శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో ప్రాజెక్టు వ్యయం మొత్తం కేంద్రమే భరిస్తుందని పేర్కొన్నారు. వీటి ప్రకారం చూసినా పెరిగిన మొత్తాన్ని కేంద్రమే భరించాలి. మోడీ ప్రభుత్వం వీటన్నింటిని తిరస్కరిస్తోంది.
 

నిర్వాసిత లెక్కల్లో తకరారు....
ముంపు గ్రామాల లెక్కల్లోనూ గందరగోళం నెలకొంది. అధికారులు రూపొందించిన కాంటూరు లెక్కల ప్రకారం 45.72 మీటర్ల (కాంటూరు) మేర ప్రాజెక్టులో నీటిని నిలువ చేస్తే ఉమ్మడి పశ్చిమగోదావరిలో 57 గ్రామాలు, ఉమ్మడి తూర్పుగోదావరిలో 165 గ్రామాలు కలిపి మొత్తం 222 పంచాయతీల్లోని 373 గ్రామాలు ముంపునకు గురవుతాయి. ప్రస్తుతం 41.15 మీటర్ల (కాంటూరు) మేర నీటిని నిలువ చేస్తే ముంపునకు గురయ్యే గ్రామాల వరకే పునరావాస పనులు చేపట్టారు. ఈ పనులు కూడా పూర్తి కాలేదు. ఇటీవల గోదావరికి వచ్చిన భారీ వరదలతో ఈ లెక్కలు తప్పుల తడకలని తేలింది 41.15 మీటర్ల (కాంటూరు) ఎత్తుకు చేరిన వరద నీరే మొత్తం 373 గ్రామాలను ముంచెత్తింది. మరికొన్ని అదనపు గ్రామాల్లోకి వరద ప్రవేశించింది. దీంతో పూర్తి స్థాయి నీటిమట్టం 45.72 మీటర్ల మేర నీటిని నిలువ చేస్తే పరిస్థితి ఏమిటన్నది ఆందోళనకరంగా మారింది. నిర్వాసితుల కోసం భూ సేకరణ, ఆర్‌ఆండ్‌ ఆర్‌ ప్యాకేజి, ఇళ్ల నిర్మాణం కోసం 33,470 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని ప్రభుత్వ అంచనా! తాజా పరిణామాల నేపథ్యంలో ఈ మొత్తం ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు 5 శాతం మందికి కూడా పునరావాసం పూర్తి కాలేదు.

సుప్రీం కోర్టు ఏం చెప్పింది ?
ముంపు ప్రాంతాలకు సంబంధించి పలు అభ్యంతరాలను, సందేహాలను లెవనెత్తుతూ ఒడిశా, ఛత్తీస్‌గడ్‌, తెలంగాణ రాష్ట్రాలు ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. విచారణ నిర్వహించిన సంజరు కిషన్‌ కౌల్‌ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రం తక్షణమే జోక్యం చేసుకోవాలని ఆదేశించింది. సెప్టెంబర్‌ నెలాఖరులోగా ప్రభావిత రాష్ట్రాలతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి సమస్యను పరిష్కరించాలని, అవసరమైతే ముఖ్యమంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతోనూ సమావేశం నిర్వహించాలని సూచించింది. దీనర్ధం పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వ పాత్రను ధృవీకరించడమే కదా !

రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది ?
మోడీ సర్కారుకు లేఖలు రాయడం, ప్రధానికి విజ్ఞప్తులు చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం సరిపెడుతోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ప్రతిసారి వివిధ విభజన సమస్యలతో పాటు పోలవరం అంశంపై కూడా లేఖ అందచేయడం పరిపాటిగా మారింది. అఖిలపక్షాలను కలుపుకుని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని, ఢిల్లీకి అఖిలపక్ష ప్రతినిధి బృందాన్ని తీసుకువెళ్లాలన్న డిమాండ్లను పట్టించుకోవడం లేదు. అదేసమయంలో 41.15 కాంటూరు వరకే పునరావాసం చేస్తామని, కేంద్రం డబ్బులు ఇస్తేనే మిగిలింది చేస్తామని సిఎం ప్రకటించారు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నిర్వాసితులను ముంచుతున్నాయన్న విమర్శలు వస్తున్నాయి.

వి. రాజగోపాల్‌