
ప్రజాశక్తి -బుచ్చయ్యపేట (అనకాపల్లి) : ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కృషితో వడ్డాదిలో పెద్దేరు నదిపై కాజ్వే నిర్మాణం పూర్తయింది. అప్రోచ్ రోడ్డు, కాజ్వేపై ఇరువైపులా స్తంభాల నిర్మాణ పనులన్నీ పూర్తిచేశారు. పెద్దేరు పాత వంతెన శిథిలమైన విషయం తెలిసిందే. ఏడాది క్రితం వంతెన మధ్యలో స్లాబు కుంగడంతో తాత్కాలికంగా మరమ్మతులు చేయించి రాకపోకలు పునరుద్ధరించారు. కొత్త వంతెన నిర్మాణానికి రూ.25కోట్లతో ఎమ్మెల్యే ధర్మశ్రీ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. త్వరలోనే ఈ నిధులు మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ఈలోగా రాకపోకలకు ఇబ్బంది లేకుండా రూ. కోటి వ్యయంతో కాజ్వే నిర్మించారు. పాత వంతెన పక్కన ఎగువభాగంలో సిమెంటు గొట్టాలు ఏర్పాటు చేసి వాటిపై కాంక్రీటుతో రోడ్డు వేశారు. పనులన్నీ పూర్తికావడంతో కాజ్వే మీదుగా రాకపోకలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాజ్వే తక్కువ ఎత్తులో నిర్మించడం వలన వర్షాకాలంలో నీటి ప్రవాహం పెరిగితే ముంపుకు గురి అయ్యే ప్రమాదం ఉంది. ఆ సమయంలో రాకపోకలు నిలిచిపోతాయి.