
న్యూఢిల్లీ : కులతత్వాన్ని, ప్రాంతీయవాదాన్ని సమాజం నుంచి కూకటివేళ్లతో పెకిలించిపారేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. దేశంలోని ప్రతి చెడుపై దేశభక్తి సాధించిన విజయానికి గుర్తుగా ఈ దసరా పండుగ ఉండాలని ఆయన ఆకాంక్షించారు. న్యూఢిల్లీలోని ద్వారకాలో మంగళవారం జరిగిన దసరా ఉత్సవాల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్న ప్రజలను ఉద్దేశించి మోడీ ప్రసంగించారు. శతాబ్దాల ఎదురుచూపుల తర్వాత అయోధ్యలో రామమందిరం నిర్మాణం జరుగుతుండటం ప్రజల అదృష్టమని ఆయన చెప్పుకొచ్చారు. త్వరలోనే మందిరం పూర్తవుతుందని, ఇది ప్రజల సహనానికి దక్కిన విజయమని మోడీ చెప్పారు. చంద్రయాన్ విజయవంతం కావడం, నూతన పార్లమెంటు భవన సముదాయాన్ని ప్రారంభించుకోవడం, మహిళా రిజర్వేషన్ చట్టాన్ని తీసుకురావడం వంటి అనేక అభివృద్ధికర విజయాలను భారత్ ఈ ఏడాది సాధించిందని మోడీ తెలిపారు. దేశంలోని ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి సాధించినట్లు అవుతుందని పేర్కొన్నారు. సామాజిక ఆర్థిక హోదా పెంపొందేలా కనీసం ఒక పేద కుటుంబానికి సహాయం పడటంతో సహా పది ప్రతీనలు ప్రతి పౌరుడు తీసుకోవాలని ఆయన కోరారు. నీటిని పొదుపు చేద్దాం, డిజిటల్ లావాదేవీలు, స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహిద్దాం, పనిలో నైపుణ్యాన్ని పెంచుకుందాం, దేశీయ పర్యాటక రంగాన్ని ప్రోత్సహిద్దాం, తృణధాన్యాలను విరివిగా వినియోగిద్దాం వంటి ప్రతీనలను కూడా ప్రధాని ప్రజలతో చేయించారు. చిన్నరాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమంటూ ప్రాంతీయవాదాన్ని పెంచిపోషించే బిజెపి పార్టీలో అగ్రనాయకుడిగా ఉంటూ నిత్యం కులాల మధ్య చిచ్చురాజేసే భావజాలంతో అంటకాగే మోడీ ఇలాంటి నీతులు చెప్పడం విడ్డూరమని వ్యాఖ్యలు వినిపించాయి.