మహారాష్ట్ర : మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఘోర ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి పల్టీలు కొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అన్నదమ్ములు మృతి చెందారు.
తెలంగాణలోని సిద్దిపేట జిల్లా చౌటపల్లికి చెందిన నలుగురు అన్నదమ్ములు కొన్నేళ్ల క్రితం బతుకుదెరువు కోసం గుజరాత్‌లోని సూరత్‌కు వెళ్లారు. ఐదురోజుల చౌటపల్లిలోని వారి బంధువు ఎరుకల రాములు మృతి చెందడంతో అతడి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ఈ నలుగురూ తమ కుటుంబసభ్యులతో కలిసి చౌటపల్లికి వచ్చారు. కుటుంబసభ్యులను చౌటపల్లిలోనే ఉంచి అన్నదమ్ములు తిరిగి సూరత్‌కు మంగళవారం కారులో బయలుదేరారు. అదే రోజు రాత్రి మహారాష్ట్రలోని ఔరంగాబాద్ వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. దీంతో కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. మృతులు ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు ఎరుకుల కృష్ణ, సంజీవ్, సురేష్, వాసుగా గుర్తించారు. అన్నదమ్ముల మరణవార్తతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.