న్యూఢిల్లీ : మునుగోడు ఉప ఎన్నికలో కారును పోలిన గుర్తులతో నష్టపోయామని... కాబట్టి కారును పోలిన చపాతీ రోలర్, రోడ్డు రోలర్ తదితర గుర్తులను తొలగించాలంటూ బిఆర్‌ఎస్ వేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఓటర్లకు అన్నీ తెలుసునని ధర్మాసనం స్పష్టం చేసింది.
హైకోర్టు తీర్పు తర్వాత దాదాపు 240 రోజుల తర్వాత సుప్రీం కోర్టుకు రావడం ఏంటని ధర్మాసనం ప్రశ్నించింది. అధికార పార్టీగా ఉన్న మీకు ఈ విషయం తెలియదా ? అని బిఆర్‌ఎస్ పార్టీ తరపు న్యాయవాదులపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషన్‌ను విచారణకు చేపట్టడం సాధ్యం కాదని ధర్మాసనం తేల్చి చెప్పింది. కావాలంటే హైకోర్టుకు వెళ్లచ్చని, అయితే.. మెరిట్స్ ఆధారంగానే అక్కడ విచారణ ఉంటుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. భారతీయ ఓటర్లు రాజకీయ నిరక్షరాస్యులు కాదని ధర్మాసనం తెలిపింది. వాళ్లకు కారు, చపాతి, రోలర్, రోడ్డు రోలర్ కు తేడా తెలియదు అనుకుంటున్నారా ? అని ప్రశ్నించింది. ఎన్నికలు వాయిదా వేయాలని మీరు కోరుకుంటున్నారా ? అని అడిగింది. ఈ మేరకు బిఆర్‌ఎస్ వేసిన పిటిషన్లను కొట్టివేస్తూ ... జస్టిస్ అభరు ఎస్ ఓకా, జస్టిస్ పంకజ్ మిథాల్ తో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది.