- అధికారంలోకి వస్తే ప్రతి ఎకరానికీ నీరు : చంద్రబాబు
ప్రజాశక్తి-అనంతపురం ప్రతినిధి : వైసిపి అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా 198 సాగునీటి ప్రాజెక్టులను (ప్రీ క్లోజర్) రద్దు చేసిందని టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్‌రెడ్డి అజ్ఞానం, ముర్ఖత్వంతో రాయలసీమ ప్రాంతం విధ్వాంసానికి గురైందని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే అనంతపురం జిల్లాతోపాటు, రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని హమీ ఇచ్చారు. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులపై ఆయన చేపట్టిన యాత్ర గురువారం అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో కొనసాగింది. అనంతపురం నగరంలోని ఎంవైఆర్ ఫంక్షన్ హాలులో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సాగునీటి ప్రాజెక్టుల గురించి వివరించారు. గోదావరి- కృష్ణా-పెన్నా నదుల అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలిపారు. నదుల అనుసంధానం ద్వారా రాయలసీమ ప్రాంతానికి 280 టిఎంసిల నీటిని నేరుగా అందించేందుకు వీలుందని పేర్కొన్నారు. తద్వారా రాయలసీమ ప్రాంతాన్ని రతనాల సీమగా మార్చవచ్చని తెలిపారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్ అనంతరం ఆయన ఆత్మకూరు మండలంలోని సింగనగుట్టపల్లి వద్ద జరుగుతున్న హంద్రీనీవా పంప్ హౌస్ పనులను పరిశీలించారు. అనంతరం పెనుకొండ వద్ద కియా కార్ల పరిశ్రమను సందర్శించారు. అక్కడి నుంచి గోరంట్ల మీదుగా కదిరి చేరుకున్నారు.
ఈ సందర్భంగా పలుచోట్ల ప్రజలను ఉద్ధేశించి చంద్రబాబు మాట్లాడారు. వైసిపి అధికారంలోకి వచ్చాక సాగునీటి ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విమర్శించారు. ఈ నాలుగేళ్ల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 198 ప్రాజెక్టులను రద్దు చేసినట్టు తెలిపారు. ఇందులో రాయలసీమకు సంబంధించి 102 ప్రాజెక్టులున్నాయన్నారు. అనంతపురం జిల్లాలో 38 ప్రాజెక్టులను రద్దు చేశారని తెలిపారు.
'కియా'పై జగన్‌వి పిట్టకథలు
కియా పరిశ్రమపై వైఎస్.రాజశేఖర్‌రెడ్డికి కల వస్తే ఇక్కడికొచ్చినట్టు ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్‌రెడ్డి పిట్టకథలు చెబుతున్నారని చంద్రబాబునాయుడు ఎద్దేవా చేశారు. అన్ని రాష్ట్రాలు పోటీపడినా ఒప్పించి ఇక్కడ ఏర్పాటు చేయడానికి తాను కృషి చేశానని తెలిపారు. ఇక్కడ ఈ పరిశ్రమ ఏర్పాటు తరువాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయన్నారు. తమ హయాంలోనే ఈ పరిశ్రమ పూర్తవకుంటే ఈపాటికి ఇక్కడ ఉండేది కాదని అన్నారు. జాకీ పరిశ్రమ ఏమైందని ప్రశ్నించారు. రాయలసీమకు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నగరాలతోపాటు పోర్టులను అనుసంధానం చేస్తే పరిశ్రమలు, వ్యవసాయం రెండూ అభివృద్ధి చెందుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి, కాలవ శ్రీనివాసులు, సత్యసాయి జిల్లా టిడిపి అధ్యక్షులు బికె.పార్థసారధి, మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, ప్రభాకర్‌చౌదరి, జెసి.ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.