
'రిస్క్ చేయొద్దు.. చాలా ప్రమాదం' అని ఎంతోమంది హెచ్చరించినా అతడు ఎలక్ట్రికల్ వస్తువుల మరమ్మత్తు పనులను చేస్తూనే ఉన్నాడు. ఒకటి, రెండు కాదు; పదేళ్లుగా అదే పనిలో ఉండి ఈ ఏడాదే సొంతంగా మరమ్మతు దుకాణం ప్రారంభించాడు. ఆ పని చేయొద్దని అతన్ని ఎందుకు వారించారంటే.. తన పని తాను చేసుకోవడానికే ఇబ్బందిపడే అంధుడు అతడు. తమిళనాడు కోయంబత్తూర్‌కి చెందిన సురేష్ మొదట సీలింగ్ ఫ్యాన్లు మరమ్మతు చేసే దుకాణంలో పనికి కుదిరాడు. అసలు పట్టుమని పదిరోజులైనా వస్తాడా అనుకున్న యజమాని ఆశ్చర్యపోయేలా పని నేర్చుకున్నాడు సురేష్. ఈ పదేళ్లలో ఫ్రిజ్‌లు, వాషింగ్ మిషన్లు, కూలర్లు, ఏసీలు వంటి పెద్ద పెద్ద ఉపకరణాల మరమ్మతులను అలవోకగా చేసే స్థాయికి ఎదిగాడు. 'మారీ ఎలక్ట్రికల్స్' పేరుతో కవుందంపాలాయంలో సురేష్ నిర్వహిస్తున్న ఆ షాపు చూసిన వారంతా 'అతని దృష్టికే లోపం వుంది కానీ.. శరీరానికి కాదు.. అందుకే ఒళ్లంతా కళ్లు చేసుకుని పని చేసుకుంటున్నాడు' అంటూ ఆశ్చర్యపోతున్నారు.

ఆరేళ్ల వయసున్నప్పుడు మెదడువాపు వ్యాధి సోకి సురేష్‌కి చూపు పోయింది. బడికి వెళ్లాడే గాని చదువు సాగలేదు. దీంతో ఐదో తరగతితో చదువు ఆపేశాడు. చదువు సాగకపోయినా చిన్న తనం నుంచీ ఎలక్ట్రానిక్ ఉపకరణాల మరమ్మతులు చేయడం అతనికి ఆసక్తి. చూపు లేకపోయినా ఇంట్లో ఉన్న రేడియో ఊడదీసి అందులో ఉన్న వస్తువులను చేతితో తాకుతూ, శబ్దాలు వింటూ ఏ వస్తువు ఎలా పనిచేస్తోందో పరిశీలించేవాడు. చిన్నతనంలో ఏర్పడిన ఈ ఆసక్తే అతన్ని మెకానిక్ వైపు నడిపిస్తుందని అతడు అప్పుడు ఊహించలేదు. అనారోగ్యంతో తండ్రి మరణించాడు. తల్లి మానసికంగా కుంగిపోయింది. ఈ పరిస్థితుల్లో ఐదుగురు తోబుట్టువులలో ఒకడైన సురేష్‌కి ఏదో ఒక పని చేసుకోక తప్పనిసరి పరిస్థితి. ఆసక్తి ఉన్న మెకానిక్ పనివైపు వెళ్దామనుకున్నాడు. అయితే చూపు లేని అతనికి పని ఎవరు ఇస్తారు ?
ఆ వ్యక్తి.. శరవనంపట్టి కృష్ణమూర్తి. కస్టమర్ల వివరాలు, వారు అప్పజెప్పిన వస్తువులను నమోదు చేసుకునే పనిని మొదట సురేష్‌కి అప్పజెప్పాడు కృష్ణమూర్తి. నిదానంగా అతనిలో ఉన్న ఆసక్తిని గమనించి మరమ్మతు పనులలో శిక్షణ ఇప్పించాడు. నాలుగేళ్లు గృహ ఎలక్ట్రికల్ ఉపకరణాల మరమ్మతుల్లో తర్ఫీదు పొందిన సురేష్ ఆ తరువాత మరో ఆరేళ్లు మణికందన్ షాపులో నిర్మాణరంగంలో ఉపయోగించే ఇండిస్టీయల్ పవర్ టూల్స్ మరమ్మతు పనులు నేర్చుకున్నాడు. ఈ పదేళ్ల అనుభవంతోనే ఇప్పుడు సొంతంగా షాపు నిర్వహిస్తున్నాడు.
సురేష్ గురించి అతని స్నేహితుడు వినోద్, 'నేను మొదట సురేష్‌ని చూసి చాలా ఆశ్చర్యపోయాను. శిక్షణ తీసుకుంటున్నప్పటి నుండే సురేష్ నాకు స్నేహితుడు. తమలో ఉన్న ప్రతిభని, సామర్థ్యాన్ని గుర్తించేది చాలా తక్కువమంది. వారిలో సురేష్ ఒకరు' అని చెప్పాడు.
'మా పెద్దక్క షాపు అద్దె కట్టింది. నా స్నేహితులు వినోద్, కొలంబస్ సాయంతో ఆరు నెలలుగా ఈ షాపు నిర్వహిస్తున్నాను. ప్రజలు నన్ను నమ్మి షాపుకు వస్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంటోంది. భవిష్యత్తులో నాలాంటి వారికి ఈ పనిలో శిక్షణ ఇస్తాను. మెరుగైన జీవనోపాధి కోసం ఆసక్తి ఉన్న ఏ పనిలోనైనా రాణించే అవకాశం అందరికీ ఉంటుంది. ప్రోత్సాహం ఉండాలి. మాపై నమ్మకం ఉంచాలి' అంటున్నాడు సురేష్. వైకల్యంతో బాధపడుతున్న సురేష్ లాంటి ఎంతోమంది వ్యక్తులు ఏదో ఒకపనిలో తమను తాము నిరూపించుకంటూ ముందుకుసాగుతూనే ఉంటారు. ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తున్న వారు ఎంతోమందికి స్ఫూర్తినిస్తున్నారు.