Jul 18,2023 21:54
  •  సింగిల్‌ జడ్జి ఉత్తర్వులు రద్దు

ప్రజాశక్తి-అమరావతి : ఎంబిబిఎస్‌ 4వ ఏడాది సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు డాక్టర్‌ వైఎస్సార్‌ మెడికల్‌ యూనివర్సిటీ ఉత్తర్వుల అమలును నిలిపేసేందుకు హైకోర్టు నిరాకరించింది. అనేక విషయాల పరిశీలన తర్వాతే వర్సిటీ పరీక్షల షెడ్యూల్‌ను ఖరారు చేసిందని చెప్పింది. పరిపాలనాపరమైన నిర్ణయాల్లో జోక్యానికి ఆస్కారం లేదని తేల్చింది. విచక్షణా నిర్ణయాల్లో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. అభ్యర్థుల వినతి మేరకు పరీక్షలు నిర్వహించి, ఆగస్టు 8లోపు ఫలితాలను వెల్లడించాలంటూ వర్సిటీని గతంలో సింగిల్‌ జడ్జి ఆదేశించారు. దీనిని వర్సిటీ సవాల్‌ చేసిన అప్పీల్‌ పిటిషన్‌ను తాత్కాలిక చీఫ్‌ జస్టిస్‌ ఎవి శేషసాయి, జస్టిస్‌ ఆర్‌.రఘునందన్‌రావుతో కూడిన డివిజన్‌ బెంచ్‌ విచారణ జరిపి తీర్పు చెప్పింది.
సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను బెంచ్‌ రద్దు చేసింది. వర్సిటీ దాఖలు చేసిన అప్పీల్‌ను అనుమతించింది. 2022-23 విద్యా సంవత్సరంలో 4వ ఏడాది ఎంబిబిఎస్‌ పార్టు-2 సప్లిమెంటరీ (థియరీ) పరీక్షలను 10.05.2023 నుంచి 24.05.2023 వరకు, ప్రాక్టికల్‌ పరీక్షను 5.06.2023 నుంచి నిర్వహించేందుకు వీలుగా వర్సిటీ నోటిఫికేషన్‌ ఇచ్చింది. కోర్టు ఆదేశాల కారణంగా ప్రాక్టికల్‌ పరీక్షను తిరిగి నిర్వహించాల్సి వచ్చింది. ఫలితంగా సప్లిమెంటరీ పరీక్షలను వాయిదా వేసింది. ఆపై, వచ్చే నెల 9 నుంచి 23వ తేదీ వరకు థియరీ, ఆగస్టు 26 నుంచి ప్రాక్టికల్‌ పరీక్ష నిర్వహణ కోసం నోటిఫికేషన్‌ వెలువరించింది. ఆగస్టులో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తే తాము ఓ విద్యా సంవత్సరం నష్టపోతామని, కాబట్టి ముందుగా పరీక్షలు నిర్వహించాలని కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. వర్సిటీ వాదనను బెంచ్‌ అనుమతించింది.
ప్రైమరీ పరీక్ష జనవరిలో నిర్వహించారని, మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా నిబంధనల ప్రకారం ప్రైమరీ పరీక్ష ఫలితాలు వెల్లడైన తేదీ నుంచి ఆరు నెలల తరువాత ఎలాంటి పరీక్షలు నిర్వహించరాదని, కాబట్టి ముందే పరీక్షలు నిర్వహించాలన్నది విద్యార్థుల వాదన. ఈ ఏడాది ఆగస్టు 11లోపు తాము ఎంబిబిఎస్‌ 4వ సంవత్సరం పరీక్ష పాస్‌ కాకుండా 2024లో నిర్వహించే నీట్‌ పరీక్షకు హాజరయ్యేందుకు అర్హత సాధించలేమన్నారు. ఆగస్టు 8లోపు ఫలితాలను వెల్లడించాలని వర్సిటీని ఆదేశిస్తూ గతంలో సింగిల్‌ జడ్జి మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. దీనిపై వర్సిటీ దాఖలు చేసిన అప్పీల్‌ను అనుమతిస్తూ డివిజన్‌ బెంచ్‌ తీర్పు చెప్పింది. పిటిషనర్లకు అనుకూలంగా సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్లు తెలిపింది.