Jun 17,2023 09:26

రంగాపురం నుంచి ప్రజలు నిత్యవసరాల కోసం 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామునికోట పట్టణానికి వెళ్లేవారు. వేసవికాలం కావడంతో వేడికి తట్టుకోలేక ప్రయాణం చేసే ప్రజలు చాలా ఇబ్బందులకు గురయ్యేవారు. ఈ ఊర్లకు మధ్యలో సీతమ్మధార అనే గ్రామం ఉండేది. అక్కడ జానకిరామయ్య రహదారి పక్కన చిన్న కిరాణా కొట్టును నడుపుతూ జీవనం సాగించేవాడు.
       ఎండలు పెరగడంతో జనం బయటకు వచ్చేవారు కాదు. దాంతో జానకిరామయ్య వ్యాపారమూ పెద్దగా సాగేది కాదు. కొబ్బరి బోండాలను, పుచ్చకాయలను కూడా అమ్మసాగాడు. అయినా అరకొరగానే అమ్ముడుపోయేవి. ఓ రోజు ఎండ బాగా పెరగడంతో రామయ్య కొట్టులో ఉండలేకపోయాడు. వచ్చిన జనం కూడా కొట్టు దగ్గర నిలబడలేక వచ్చేవారు కాదు.
        అప్పుడే ఓ ఆలోచన వచ్చింది. చల్లదనం కోసం పక్కనే ఉన్న అడవిలోకి వెళ్లి కొన్ని కర్రలను, తాటి ఆకులను తీసుకొచ్చి కిరాణ ముందు ఒక పెద్ద పందిరి వేశాడు. కూర్చోవడానికి తాటి మొద్దులను కూడా ఏర్పాటు చేశాడు. దాంతో రహదారి గుండా వెళ్లేవారు పందిరి కింద కాసేపు సేదతీరేవారు. మాట్లాడుకునేవారు. కొట్టులో కొబ్బరి బోండాలు, పుచ్చకాయ, మంచినీళ్లు, మజ్జిగ కొనుక్కునేవారు.
        ఒకరోజు జానకీరామయ్య కూతురు చైత్ర నాన్నకు భోజనం తీసుకుని వచ్చింది. నాన్న భోజనం చేసేంత వరకు షాపులో కూర్చుంది. ఎదురుగా కొన్ని పక్షులు కనిపించాయి. వాటి కళ్లు నీళ్ల కోసం వెతుకుతున్నట్లు అనిపించింది. వెంటనే కొబ్బరి పందిరి కింద ఉన్న కొబ్బరి చిప్పల్లో నీళ్లు పోసింది. పక్షులన్నీ కొబ్బరి బోండాల చుట్టూ కిచ్‌.. కీచ్‌.. మంటూ తిరుగుతూ నీటిని తాగుతూ చాలా సందడి చేశాయి. ఆ రోజు నుంచి జానకిరామయ్య కూడా పక్షులకు నీళ్లు పెట్టడం మొదలుపెట్టాడు. అది చూసిన జనం రామయ్యను మెచ్చుకునేవారు. పక్షులన్నీ మధ్యాహ్నం కాగానే కిరాణం దగ్గరికి వచ్చి సందడి చేస్తూ ఆ నీరు తాగి తొట్లపైన ఆడుకుంటూ గడిపేవి. అది చూసిన స్థానికులు, బాటసారులు జానకీరామయ్య కిరాణం దగ్గర కాలక్షేపం చేసేవారు. దాంతో ఆయన వ్యాపారమూ పెరిగింది. చాలా సంతోషించాడు. మనం చేసిన మంచి పని మనకు తప్పక సహాయం చేస్తుంది అనుకున్నాడు.
 

- ముక్కామల జానకీరామ్‌
63053 93291