Sep 24,2023 12:20

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : సిపిఎస్‌, జిపిఎస్‌ రద్దు కై రేపు నిర్వహించనున్న చలో కలెక్టరేట్‌ ను విజయవంతం చేయాలని ఎపిటిఎఫ్‌ నాయకులు సిహెచ్‌.పైడితల్లి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అధికారంలోకి వచ్చిన వారంలో సి.పి.యస్‌ రద్దు చేస్తామని ప్రతిపక్షంలో వున్నప్పుడు ఇచ్చిన హామిని మరచి 4 సంవత్సరాల అధికారం తరువాత ఇప్పుడు జి.పి.యస్‌ అనే కొత్త విధానాన్ని ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాలు వ్యతిరేకిస్తూ వున్నా కూడా బలవంతంగా ప్రభుత్వం ప్రతిపాదించడం క్యాబినెట్‌ అంగీకారం తెలపడం ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలను మోసం చేయడమేనని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ విధానాన్ని ఆదిలోనే వ్యతిరేకించకపోతే 2003 డి.యస్‌.సి వారికి, ఓ.పి.యస్‌ లో వున్న ఉపాధ్యాయ, ఉద్యోగులకు కూడా జి.పి.యస్‌ అమలు చేయడానికి ప్రభుత్వం వెనుకాడదు అన్న వాస్తవం గ్రహించాల్సిన అవసరం వుందన్నారు. కలిసి వచ్చే అన్ని సంఘాలతో జి.పి.యస్‌ విధానానికి వ్యతిరేకంగా 25న చలో కలెక్టరేట్‌ నిర్వహించాలని ఫ్యాప్టో నిర్ణయించిందని, ఫ్యాప్టో సభ్య సంఘాల బాధ్యులందరూ ఈ ఉద్యమాన్ని విజయవంతం చేయాలని ప్రకటన ద్వారా పిలుపునిచ్చారు.