ఎక్కాల బుక్కుగా మారిన
బతుకు పుస్తకంలో
ఎటు చూసినా లెక్కలే లెక్కలు
నిక్కరు తొడిగిన వయసు నుండే
రెక్కలు చాచిన లెక్కలు
స్వలాభం బట్టే స్నేహం లెక్కలు
వరకట్నం బట్టీ వివాహం లెక్కలు
కొలతల మేరకు పలకరింపులు
కేలరీలు చూసీ ఆరగింపులు
అక్కర మేరకు చుట్టరికాలు
గుంపుల బట్టే గుణకారాలు
బంధంలోనూ భాగహారాలు
పదును తేలిన తెలివి తేటలతో
అదును తీరితే అన్నీ తీసివేతలు
కూడికలు లేని కుటుంబాలు
కన్నవారిని చేరదీసే
చిన్నపనికీ వంతులు.. వాటాలు... బేరీజులు
మిత్రమా,
లెక్కల్నీ, చిక్కుల్నీ ఓ పక్కన పడేద్దాం
సహజంగా నవ సమాజంగా జీవిద్దాం
జీవిత పర్యంతమూ ప్రేమిద్దాం
జీవన సౌందర్యాన్ని రుచి చూద్దాం!
- డా. డి.వి.జి.శంకర రావు, మాజీ ఎంపీ,
94408 36931










