- 20 శాతం లెక్కించాలి : కర్ణాటక
- కేంద్రానికి లేఖ రాస్తాం : తుంగభద్ర బోర్డు
- 40 ఏళ్లుగా లేనిది ఇప్పుడెందుకు? : ఎపి
- ఆర్‌డిఎస్ ఆధునీకరణ చేపట్టాలి : తెలంగాణ
ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో : తాగునీటి అవసరాల కోసం తీసుకునే నీటిని 20 శాతం మాత్రమే లెక్కించాలని కర్ణాటక విజ్ఞప్తి చేసింది. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం తాగునీటికి 10 టిఎంసిల నీటిని తీసుకుంటే, ఆ నీటిలో ఎనిమిది టిఎంసిల రిటర్న్ ప్లో ఉంటుందనీ, ఈ నేపథ్యంలో 20 శాతం మాత్రమే లెక్కలోకి తీసుకోవాలని కర్ణాటక గట్టివాదనను వినిపించింది. తుంగభద్ర నదీ యాజమాన్య బోర్డు (టిఆర్‌ఎంబి) సమావేశం ఛైర్మన్ డిఎం రారుపురే అధ్యక్షతన శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. ఎపి ఇఎన్‌సి సి.నారాయణరెడ్డి , కర్ణాటక జలవనరుల శాఖ ఇఎన్‌సితోపాటు తెలంగాణ ఇఎన్‌సి సి.మురళీధర్ తదితరులు పాల్గొన్నారు. తాగునీటి అవసరాలకు 20 శాతం లెక్కించాలనే అంశంపై ఆంధ్రప్రదేశ్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. 40 ఏళ్లుగా లేనిది, ఇప్పుడు లేవనెత్తడం ఎందుకని ప్రశ్నించింది. బచావత్ ట్రిబ్యునల్ అమల్లోకి వచ్చినప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరని, నీటి అవసరాలు పెరిగాయని అందువల్లే ఈ అంశాన్ని లేవనెత్తుతున్నామని కర్ణాటక అభిప్రాయం వ్యక్తం చేసింది. 20 శాతం మాత్రమే లెక్కించాలంటే రిటర్న్ ప్లో కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందనీ, ఆ ఏర్పాట్లు లేకుండా 20 శాతం వాదనకు అర్థం లేదని ఏపీ సైతం తన అభిప్రాయాన్ని స్పష్టం చేసింది. రెండు రాష్ట్రాల వాదలను విన్న టిఆర్‌ఎంబి చైర్మన్ రారుపురే మాట్లాడుతూ.. కృష్ణా బోర్డు సమావేశంలోనూ ఈ అంశాన్ని తెలంగాణ ప్రస్తావించిందనీ, తుంగభద్ర బోర్డు సమావేశంలో కర్ణాటక లేవనెత్తిన అంశాలతోపాటు కృష్ణాబోర్డు సమావేశంలో తెలంగాణ లేవనెత్తిన అంశంపై తగిన నిర్ణయం తీసుకోవాలని కేంద్ర నీటి వనరుల శాఖకు లేఖ రాయనున్నట్టు తెలిపారు. ఇక ఆర్‌డిఎస్ ఆధునీకరణ పనులు వెంటనే చేపట్టాలనీ, వాటా మేరకు నీరు తెలంగాణకు రావడం లేదని తెలంగాణ ఇఎన్‌సి సి.మురళీధర్ బోర్డు దృష్టికి తెచ్చారు. దీనిపై తుంగభద్ర బోర్డు చైర్మన్ రారుపురే స్పందిస్తూ.. ఆర్‌డిఎస్ ఆధునీకరణకు ముందు, కేంద్రం నీటి, విద్యుత్ పరిశోధన సంస్థ (సిడబ్ల్యూపిఆర్‌ఎస్)తో అధ్యయనం చేయించాలంటూ కృష్ణాబోర్డులో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఆ అధ్యయనం అనంతరం నివేదిక అందిన తర్వాతే ఆధునీకరణపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా టిఆర్‌ఎంబి బడ్జెట్ పై చర్చ జరిగింది.










