Oct 30,2023 11:36

విజయవాడ : ప్రజా సమస్యలే అజెండాగా ... నేటి నుండి ' ప్రజా రక్షణ భేరి ' పేరుతో సిపిఎం ప్రచార జాతాలను చేపట్టింది.

సోమవారం కర్నూలు జిల్లా ఆదోనిలో, పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో, మరో జాతా శ్రీకాకుళం జిల్లాలోని మందసలో ప్రారంభమైంది. కరువు, వెనుకబడిన ప్రాంతాల్లో పర్యటించేలా చేపట్టిన ప్రజారక్షణ భేరీ ప్రచార జాతాను సిపిఎం కేంద్రకమిటి సభ్యులు ఎం.ఏ.గఫూర్‌, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో సాగనుంది. కర్నూలు జిల్లా ఆదోని నుండి ఈ ప్రజారక్షణ భేరీ జాతాను సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు అశోక్‌ థావలే ప్రారంభించారు. మరోవైపు ... సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో ప్రచార జాతాను ప్రారంభించారు. ఈ జాతాలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కిల్లో సురేంద్ర పాల్గొన్నారు. వి.వెంకటేశ్వర్లు ఈ యాత్రను సమన్వయం చేస్తున్నారు. ఈ యాత్ర ప్రధానంగా పోలవరం నిర్వాసితులు, గిరిజన ప్రాంతాల్లో నెలకొన్న భూ సమస్యలపై సాగుతుందని నేతలు తెలిపారు. మరో ప్రచారజాతా శ్రీకాకుళం జిల్లాలోని మందసలో ప్రారంభమై కోస్తా పారిశ్రామిక కారిడార్‌ గుండా సాగుతుంది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాథం ఆధ్వర్యంలో కొనసాగుతోన్న ఈ జాతాను ఆలిండియా కిసాన్‌ సభ జాతీయ ప్రధానకార్యదర్శి విజు కృష్ణన్‌ ప్రారంభించారు. మంతెన సీతారాం సమన్వయం చేస్తున్నారు. పరిశ్రమల ఏర్పాటు, అసంఘటిత రంగకార్మికులు, కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు కనీసవేతన చట్టాన్ని అమలు చేయాలని తదితర సమస్యలతో ఈ ప్రచారజాతా సాగుతుందని నేతలు తెలిపారు.