ప్రజాశక్తి-తాడేపల్లి రూరల్ : ప్రజలపై భారాల మోపుతూ పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని కోరుతూ శనివారం ఎం టి ఎం సి పరిధిలోని కుంచనపల్లి విద్యుత్ ఉపకేంద్రం వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం సీనియర్ నాయకులు జొన్న శివశంకరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై అదనపు భారాలు వేసేందుకు విద్యుత్ చార్జీలను విపరీతంగా పెంచిందని అన్నారు. నరేంద్ర మోడీ విధానాలను తూచా తప్పకుండా పాటించే వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు పెట్టే ప్రక్రియను మొదలుపెట్టారని అన్నారు. ఈ స్మార్ట్ మీటర్లు పెట్టడం వలన రైతాంగం తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. విద్యుత్ చట్ట సంస్కరణలు తీసుకువచ్చి, సామాన్య ప్రజల పైన, రైతంగం పైన విద్యుత్ భారాలు మోపడం అన్యాయమని సిపిఎం పార్టీ దీన్ని వ్యతిరేకిస్తుందని అన్నారు. 2014 నుండి 2019 వ సంవత్సరం వరకు ట్రూ అప్ చార్జీల పేరిట, సర్దుబాటు చార్జీల పేరిట రాష్ట్ర ప్రభుత్వం వినియోగదారులపై అదనపు విద్యుత్ ఛార్జీల బారాలు వేస్తున్నారని సిపిఎం పార్టీ తాడేపల్లి మండల కార్యదర్శి దొంతి రెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. విద్యుత్ రంగాన్ని నిర్వీర్యం చేసి ప్రవేట్ కంపెనీలకు దారాదత్తం చేసేందుకు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూనుకుంటుందని ఆయన ఎద్దేవా చేశారు. విద్యుత్ రంగాన్ని ప్రభుత్వ ఆధీనంలోనే ఉంచాలన్నారు. అదేవిధంగా గతంలో విద్యుత్తు వినియోగించిన దానికి మరలా ఇప్పుడు ట్రూ అప్ చార్జీలు వేయటం ఏంటని ఆయన ప్రశ్నించారు. తక్షణమే పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని సిపిఎం పార్టీడిమాండ్ చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం తాడేపల్లి మండల నాయకులు అమ్మిశెట్టి రంగారావు, పల్లె కష్ణ, గుడిసె శ్రీనివాసరావు, అమ్మిశెట్టి సుబ్బారావు, బొడ్డు మోహనరావు, కొండపల్లి హరీష్, అమ్మిశెట్టి అర్జునరావు, టి. అభి, జి ప్రవీణ్, నల్లపు నవీన్, మారుమాక వంశీ, బిరుదుగడ్డ రమేష్, ఎం దిలీప్ తదితరులు పాల్గొన్నారు.










