ప్రజాశక్తి - నందిగామ (ఎన్‌టిఆర్) : నందిగామ డివిఆర్ కాలనీలో ముత్యాలమ్మ గుడి కుల్చివేతకు నిరసనగా ... ఆందోళన చేపట్టిన సిపిఎం నాయకులను పోలీసులు శనివారం గృహ నిర్బంధం చేశారు . ఈ సందర్భంగా సిపిఎం నాయకులు ఖాసిం, గోపాల్ మాట్లాడుతూ ... పోలీసుల ముందస్తు అరెస్టులను ఖండించారు. డివిఆర్ కాలనీలో ముత్యాలమ్మ గుడి కూల్చివేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలనీలో మౌలిక వసతులు కల్పించకుండా అధికార పార్టీ నాయకులు మత విద్వేషాలు రెచ్చగొడుతూ ముత్యాలమ్మ గుడి కూల్చటం హేయమైన చర్యని ఖండించారు. డివిఆర్ కాలనీలో ఇళ్ల పట్టాల క్రమబద్దీకరణ చేయాల్సి ఉండగా ఇంతవరకు చేయలేదని ఆరోపించారు. డ్రైనేజీల సమస్యలు అంతర్గత రహదారులు అధ్వానంగా ఉన్నాయని, ఇళ్ల పట్టాలు ఇవ్వాల్సి ఉన్నాయని, పాఠశాల నిర్మించాల్సి వలసి ఉందన్నారు. ఇలాంటి సమస్యల పరిశీలించకుండా పేద ప్రజలు విరాళాలు సేకరించి వాళ్ళు కష్టార్జితంతో నిర్మించుకున్న గుడిని కూల్చివేయడం అధికార పార్టీ దురహంకారానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ ప్రతిపక్ష నాయకుల మధ్య పేద ప్రజల నలిగిపోతున్నారని ఇప్పటికైనా కాలనీలో మౌలిక వసతులు కల్పించి పేద ప్రజల ముత్యాలమ్మ గుడిని కూల్చివేసిన ప్రదేశంలోనే నిర్మించాలని డిమాండ్ చేశారు.










