కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను ఎండగడతాం : ప్రజలను చైతన్యపరుస్తాం : 'ప్రజాశక్తి'తో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ గఫూర్

ప్రజాశక్తి- కర్నూలు ప్రతినిధి : ప్రజారక్షణ భేరి యాత్రలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను ఎండగడతామని, ప్రజలను చైతన్యపరుస్తామని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ.గఫూర్ చెప్పారు. సోమవారం కర్నూలు జిల్లా ఆదోని నుంచి బస్సు యాత్ర ప్రారంభమై 13 జిల్లాల్లో పర్యటించి నవంబర్ తొమ్మిదిన గుంటూరు జిల్లా తాడేపల్లిలో ముగియనుంది. ఈ యాత్రకు నాయకత్వం వహించే గఫూర్ 'ప్రజాశక్తి'తో ముఖాముఖిగా మాట్లాడారు.
బస్సు యాత్ర ఎలా సాగనుంది ?
గఫూర్ : సోమవారం కర్నూలు జిల్లా ఆదోనిలో ప్రారంభమయ్యే బస్సు యాత్ర నవంబర్ 9న గుంటూరు జిల్లా తాడేపల్లి వరకూ 13 జిల్లాలను కవర్ చేస్తూ సాగనుంది. కర్నూలు, నంద్యాల, కడప, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, గుంటూరు జిల్లాల్లో బస్సు యాత్ర సాగుతుంది. పలు ప్రాంతాల్లో బహిరంగ సభలు ఉంటాయి. బస్సు యాత్ర తరువాత నవంబర్ 15న విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నాం. ఈ ప్రచారం బహిరంగ సభకు జనసమీకరణకు కూడా తోడ్పడుతుంది.
బస్సు యాత్ర ముఖ్య ఉద్దేశం ఏమిటి ?
గఫూర్ : బస్సు యాత్ర ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను ఎండగడతాం. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలకు ఏదో ఒక రకంగా అధికారంలోకి రావాలనే తపన తప్ప ప్రజా సమస్యలు, రాష్ట్ర అభివృద్ధి పట్టడం లేదు. ప్రజా సమస్యల వైపు ప్రజల ఆలోచన మళ్లింపజేస్తాం. బటన్ నొక్కడమే అభివృద్ధి అని వైసిపి, రాజధాని అమరావతి అభివృద్ధే రాష్ట్ర అభివృద్ధి అని టిడిపి చెబుతున్నాయి. అసమానతలు లేని అభివృద్ధి చేయాలనేది సిపిఎం ప్రధాన డిమాండ్. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ, ప్రకాశం జిల్లాల ప్రత్యేక సమస్యలు పరిష్కరించాలి. అమరావతి రాజధానిగా ఉంటూ అన్ని జిల్లాలనూ అభివృద్ధి చేయాలి. కేంద్ర ప్రభుత్వం విభజన హామీలను అమలు చేయడం లేదు. రాష్ట్రంలోని మూడు పార్టీలూ బిజెపి ఏమీ చేయకున్నా ఆ పార్టీతో అంటకాగుతున్నాయి. రాష్ట్రానికి కేంద్రంలోని బిజెపి పాలన శాపంగా మారింది. కేంద్ర ప్రభుత్వాన్ని ముద్దాయిగా నిలబెట్టే ప్రయత్నాన్ని బస్సు యాత్ర ద్వారా చేస్తాం. రాష్ట్రంలోని వైసిపి, టిడిపి, జనసేన పార్టీల వల్ల రాష్ట్రంలో మతోన్మాద శక్తులు బలపడుతున్నాయి. మతోన్మాద శక్తులు బలపడితే రాష్ట్రం నాశనం అవుతుంది. కేంద్ర ప్రభుత్వం చేస్తోన్న ద్రోహాన్ని గురించి చెబుతూ రాష్ట్రంలోని పార్టీల వైఖరి గురించి ప్రజలను చైతన్య పరచడమే బస్సు యాత్ర ప్రధాన ఉద్దేశం.
ఇంకా వేటి గురించి ప్రజలకు వివరించనున్నారు ?
గఫూర్ : విభజన హామీలు, నీటి పారుదల ప్రాజెక్టులు, కృష్ణా జలాలతో పాటు వేదవతి, గుండ్రేవుల వంటి స్థానికరగా ఉండే ప్రధాన సమస్యల గురించి బస్సు యాత్రలో ప్రజలకు వివరిస్తాం.
బస్సు యాత్ర బృందంలో ఎవరెవరుంటారు ?
గఫూర్ : నాతోపాటు వి.కృష్ణయ్య, కె.ఉమామహేశ్వరరావు, రమాదేవి, భాస్కరయ్య తదితరులు ఉంటారు.
ఎన్నికల్లో ఎవరితో కలిసి వెళ్లే అవకాశం ఉంది ?
గఫూర్ : ఎన్నికల ఎత్తుగడలు ఇంకా చర్చగానే ఉంది. బిజెపితో కలిసి ఉండే ఏ పార్టీతోనూ సర్దుబాట్లు ఉండవు.
రాయలసీమ పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏంటి ?
గఫూర్ : రాయలసీమకు టిడిపి హయాంలో అన్యాయం జరిగింది. వైసిపి హయాంలో మరీ ఘోరంగా అన్యాయం జరుగుతోంది. వైసిపి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొదటి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కర్నూలు ఎస్‌ఎపి క్యాంప్‌లో నిర్వహించారు. ఆ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి అనేక హామీలు ఇచ్చారు. ఏ ఒక్కటీ అమలు చేయలేదు. చంద్రబాబును తిడితే సరిపోతుందని జగన్ అనుకుంటున్నారు. అభివృద్ధి కావాలని ప్రజలు కోరుకుంటున్నారు.