Oct 14,2023 20:55

- నవంబర్‌ నుంచి బస్సు యాత్రలు
- బటన్‌ నొక్కుడుతో సర్వతోముఖాభివృద్ధి అసాధ్యం
- టిడిపికి ప్రత్యామ్నాయ ప్రణాళిక లేదు : ఎంఎ గఫూర్‌
ప్రజాశక్తి - కడప ప్రతినిధి:కర్ణాటకలో ఎగువభద్ర ప్రాజెక్టు నిర్మిస్తే రాయలసీమ ఎడారిగా మారుతుందని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎం.ఎ.గఫూర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. కడప నగరంలోని స్థానిక సిపిఎం జిల్లా కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..కృష్ణా జలాల పంపిణీ వ్యవహారాన్ని ట్రిబ్యునల్‌కు అప్పగించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. కర్ణాటక రాష్ట్రానికి రూ.ఆరు వేల కోట్లను ఇచ్చి ఎగువభద్ర ప్రాజెక్టు నిర్మించడాన్ని ప్రోత్సహిస్తోందని, ఇటువంటి వికృత ధోరణులతో రాష్ట్రాల మధ్య తగువు సృష్టిస్తోందన్నారు. ప్రత్యేక హోదా, వెనుకబడిన ప్రాంతాల ప్యాకేజీ ఇవ్వని బిజెపికి భజన ఎందుకు చేస్తున్నారని అధికార, ప్రతిపక్ష పార్టీలను నిలదీశారు. వైసిపి పాలనలో రాష్ట్ర అభివృద్ధి నిర్లక్ష్యానికి గురవుతోందన్నారు. బటన్‌ నొక్కుడుతో సర్వతోముఖాభివృద్ధి అసాధ్యమని తెలిపారు. ప్రాజెక్టులు, పరిశ్రమల స్థాపన, ఉపాధి హామీల ద్వారానే ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు. ప్రతిపక్ష టిడిపికి ప్రత్యామ్నాయ ప్రణాళిక లేదని విమర్శించారు. విశాఖ ఉక్కుపై చంద్రబాబు, పవన్‌ మాట్లాడడం లేదని, ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బస్సు యాత్రలు, ఉద్యమ యాత్రలను సిపిఎం చేపడుతోందన్నారు. నవంబర్‌లో విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని, దీనికి జాతీయ నాయకత్వం హాజరు కానుందని తెలిపారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని, నిరసన, ధర్నాలకు అవకాశం లేకుండా పోయిందని, ధర్నాలు, నిరసనలంటేనే ముఖ్యమంత్రి జగన్‌కు వణుకు పుడుతోందన్నారు. ఇటువంటి నియంతృత్వ ధోరణులతో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పాలనార్హత కోల్పోయారని విమర్శించారు. ప్రత్యామ్నాయ ప్రణాళికలతో ప్రజల్లోకి వెళ్తున్నామని తెలిపారు. సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌, కార్యదర్శివర్గ సభ్యులు మనోహర్‌, ఐ.ఎన్‌.సుబ్బమ్మ, రామమోహన్‌ పాల్గొన్నారు.