Sep 03,2023 16:22
  •  ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను భర్తీ చేయాలి
  •  నిరుద్యోగ భృతి చెల్లించాలి : గఫూర్‌

ప్రజాశక్తి - కర్నూలు కలెక్టరేట్‌ : నిరుద్యోగులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసగిస్తున్నాయని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ.గఫూర్‌ విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటిని వెంటనే భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. 'నిరుద్యోగ సమస్య-కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి' అనే అంశంపై కర్నూలులోని బిర్లా కాంపౌండ్‌ విజేత స్టడీ సర్కిల్‌లో ఆదివారం సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా గఫూర్‌ మాట్లాడుతూ.. యువత పట్ల ప్రభుత్వాలకు సరైన విధానాలు లేకపోవడం వల్ల నిరుద్యోగం భారీగా పెరిగిపోయిందన్నారు. చదువుకున్న, చదువు లేని యువత 33 శాతం ఉపాధి లేక నిరాశలో ఉన్నారని తెలిపారు. కేంద్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో 10 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, ఒక్క రైల్వేలోనే ఆరు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ఆర్మీలో లక్షలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా వాటిని భర్తీ చేయకుండా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. బ్యాంకుల విలీనం వల్ల ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రిక్రూట్‌మెంట్‌ పూర్తిగా సన్నగిల్లిందని తెలిపారు. మానవశక్తిని ఉపయోగించుకోకుండా కృత్రిమ మేధస్సుపైనే ఆధారపడి కార్పొరేట్లకు లాభాలు పెంచి పోషించేలా ప్రభుత్వాల వైఖరి ఉందని మండిపడ్డారు. జగన్‌ అధికారంలోకి రాకముందు రెండు లక్షల 40 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారని, ప్రస్తుతం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 80,000 ఉపాధ్యాయ, గ్రూప్స్‌, ఎస్‌ఐ, కానిస్టేబుల్‌, లైబ్రరీ, పశుసంవర్ధకశాఖ తదితర ఉద్యోగాలను భర్తీ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. తక్షణమే ఖాళీలన్నింటినీ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు భర్తీ చేయాలని, అంతవరకూ నిరుద్యోగ భృతి ఇవ్వాలని, ఇది భిక్ష కాదు హక్కుగా మార్చాలని డిమాండ్‌ చేశారు. సదస్సుకు సిపిఎం కర్నూలు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కెవి.నారాయణ అధ్యక్షత నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘం నాయకులు నగేష్‌, రాఘవేంద్ర హుస్సేన్‌ బాష, విద్యార్థి సంఘం నాయకులు అబ్దుల్లా, సాయి ఉదరు, అమర్‌ తదితరులు పాల్గొన్నారు.