Nov 09,2023 14:53

-తెనాలి చేరిన ప్రజారక్షణభేరి బస్సు యాత్ర 
- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి పై నిప్పులు చెరిగిన సిపిఎం అగ్ర నేత గఫూర్


ప్రజాశక్తి ‌ - తెనాలి : రాష్ట్రాభివృద్ధి కోసం బిజెపి వ్యతిరేక శక్తులతో కలిసి పని చేయడమే లక్ష్యంగా సిపిఎం ముందుకు సాగుతుందని ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే గఫూర్ చెప్పారు‌. ప్రజారక్షణభేరి ప్రచారంలో భాగంగా చేపట్టిన బస్సు యాత్ర గురువారం గుంటూరు జిల్లా తెనాలి ప్రాంతానికి చేరింది. ఈ సందర్భంగా మార్కెట్ కూడలిలోని అన్నాబత్తుని పురవేదికపై జరిగిన బహిరంగ సభలో గఫూర్ మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పది లక్షల కోట్లు అప్పు చేశారని, సంక్షేమ పథకాలకు కేవలం బటన్ నొక్కడం ద్వారా ప్రజలకు చేరింది రెండున్నర లక్షల కోట్లు మాత్రమేనని గణాంకాలు చెబుతున్నాయన్నారు. మిగిలిన ఏడున్నర లక్షల కోట్లు ఎవరిఖాతాలకు చేరాయో తేల్చాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ప్రతినెల 4 వేల కోట్లు అప్పు లేనిదే రాష్ట్ర మనుగడ సాగటం లేదన్నారు. ఉద్యోగులకు, మున్సిపల్ కార్మికులకు, పంచాయతీ కార్మికులకు  సకాలంలో వేతనాలు అందటం లేదన్నారు. నెలల తరబడి జీతాలు చెల్లించకుంటే కార్మికులు ఎలా బతకాలని ప్రశ్నించారు. ఓవైపు గ్రామపంచాయతీలు నిర్వీర్యం అవుతున్నాయన్నారు. కేంద్రం ద్వారా పంచాయతీలకు విడుదలయ్యే నిధులలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదని చట్టాలు స్పష్టంగా చెబుతున్నా, అందుకు భిన్నంగా ఆ నిధులు నేరుగా తాడేపల్లి చేరుతున్నాయని, తద్వారా పంచాయతీ నిధులను కూడా ప్రభుత్వం దారి మళ్ళిస్తుందన్నారు. రాష్ట్రంలో ఉపాధి లేక ప్రజలు వలసలు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో లక్షల మంది వలసలకు వెళుతున్న పరిస్థితి బస్సు యాత్రలో గమనించామన్నారు. పంటలు లేక ఎండిపోయిన పొలాలు,  నిస్సహాయంగా ఉన్న ఆర్పీకే వ్యవస్థను గమనించమన్నారు. రాష్ట్రంలో దాదాపు 400 కరవు మండలాలుగా ఉన్నాయని, ప్రభుత్వం మాత్రం కేవలం 103 మండలాలు మాత్రమే కరవు మండలాలుగా ప్రకటించిందన్నారు. ఆయా మండలాలకు చేపట్టనున్న సహాయక చర్యలను కూడా వెల్లడించలేదన్నారు. కేవలం బటన్ నొక్కడం ద్వారానే అభివృద్ధి సాధ్యం కాదన్నారు. సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న వారి జాబితాలలో గణనీయమైన అవకతవకలు ఉన్నాయని, ఫలితంగానే వాటిని ఎక్కడ బయట పెట్టడం లేదన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగం తాండవిస్తుందని, బిటెక్, ఎంటెక్, ఎంబీఏ చదివిన వారు కూడా ఉపాధి కోసం ఆటోలు నడుపుకోవాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధి పరిశ్రమల తోనే సాధ్యమని, పరిశ్రమలు రావాలంటే కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వాలని, దానికి కేంద్రం నుంచి సానుకూల స్పందన లేదన్నారు. ఇదే విషయంపై రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రాన్ని ప్రశ్నించే సత్తా కూడా లేదన్నారు. ప్రజా ప్రతినిధుల విషయానికొస్తే ఎమ్మెల్యేలు ఇసుక దోపిడీలో కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారని, ప్రభుత్వ భూములను పేదల భూముల కబ్జాలకు పాల్పడుతున్నారన్నారు. అరాచకమైన పాలన రాష్ట్రంలో నెలకొందన్నారు. ప్రజాస్వామ్య దేశంలో కనీసం నిరసన తెలిపే హక్కును కూడా ప్రభుత్వం హరించి వేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడును అరెస్టు చేసిన విధానాన్ని సిపిఎం కూడా ఖండించిందన్నారు. అయితే ఈ అరెస్టు వెనక కేంద్రం హస్తము ఉన్నదని ఆ పార్టీ వర్గాల్లోనే జోరుగా ప్రచారం సాగుతున్నప్పటికీ, బెయిల్ పై  బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పటం సిగ్గుచేటని ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ప్రజలకు మేలు జరగాలన్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలు మారాలన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజా సమస్యల పైన బిజెపి వ్యతిరేక శక్తులతో కలిసి పోరాడుతామని స్పష్టం చేశారు. రాష్ట్ర కమిటీ సభ్యులు కె ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత నెలకొన్న పరిస్థితులు అభ్యుదయవాదులు, లౌకిక వాదులలో ఆందోళన రేకెత్తిస్తున్నాయన్నారు. బిజెపి ఆర్ఎస్ఎస్ కలిసి కుల మతాల మధ్య చిచ్చు పెట్టి విద్వేషాలు రెచ్చగొట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుందన్నారు. దేశంతో పాటు రాష్ట్రంలో కూడా దారుణమైన పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వాటిని తిప్పి కొట్టాల్సిన అవసరం ఉందన్నారు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశం వెలుగుతోంది,  అచ్చేదిన్ అంటూ వ్యాఖ్యానించారని, అయితే కష్టజీవులు, రైతులకు మాత్రం అచ్చే దిన్ జాడలే కనిపించడం లేదన్నారు. కేవలం అదాని, అంబానీ, టాటా, బిర్లా, మఫత్లాల్  వంటి కార్పొరేట్లకు మాత్రమే మోడీ చెప్పిన అచ్చే ధిన్ వర్తించిందన్నారు. మోడీ అధికారంలోకి వచ్చిన నాటికి అదాని ఆస్తులు కేవలం 10వేల కోట్లు అయితే, ఇప్పుడు లక్ష కోట్లకు చేరటమే అందుకు ఉదాహరణగా చెప్పారు. అలాంటి బడా బాబులకు పన్నుల చెల్లింపులను మినహాయింపుని ఇచ్చారని ఆరోపించారు. మోదీ తొమ్మిదేళ్ల పాలనలో అదాని, అంబానీ టాటా, బిర్లా,  మఫత్లాల్  వంటి కార్పొరేట్లకు 12 లక్షల కోట్ల రుణమాఫీ వర్తించిందన్నారు. రాష్ట్రం విషయానికొస్తే కరవు జాడలు లేవని సీఎం జగన్ చెబుతున్న మాటల్లో వాస్తవాలు లేవన్నారు. కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికుల సర్వీస్లను క్రమబద్ధీకరిస్తానని చెప్పిన ప్రభుత్వం, ఔట్సోర్సింగ్ కార్మికులకు మొండి చేయి చూపిందన్నారు. అంగన్వాడీ, ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాల పెంచుతామని చెప్పిన జగన్ వాటికి తిలోదకాలు ఇచ్చారన్నారు. ఉద్యోగుల సిపిఎస్ ను రద్దుచేసి ఓపిఎస్ ఇస్తామని చెప్పిన జగన్ ఆ హామీ నిలబెట్టుకోలేకపోయారన్నారు. నాలుగున్నరేళ్ళ తర్వాత సిపిఎస్ కు బదులు జి పి ఎస్ అమలు చేస్తామని చెబుతున్నారని, దీనిని ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్నారు. సిపిఎస్ రద్దు చేసేంతవరకు సిపిఎం పోరాటం ఆగదని స్పష్టం చేశారు. సామాజిక న్యాయం అంటూ వైసిపి చేస్తున్న ప్రజా సాధికార యాత్ర అసత్యాల పుట్ట అని చెప్పారు. రాష్ట్రంలో రెండున్నర లక్షల పోస్టులు భర్తీ కాలేదన్నారు. వాటిలో 65 వేల పోస్టులు దళిత గిరిజనులకు చెందాల్సినవేనని, ఈ నేపథ్యంలో సాధికారత ఎక్కడని ప్రశ్నించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేశాన్ని రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారన్నారు. ఆయన మాటల ప్రకారం తొమ్మిది సంవత్సరాలలో 18 కోట్ల ఉద్యోగాలు ఎక్కడని ప్రశ్నించారు. కనీసం 18 లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదన్నారు. పదవీ విరమణ తప్ప కొత్తగా పోస్టులు భర్తీ చేసిన దాఖలా లేదన్నారు. మరోవైపు నిత్యవసరాల ధరలు ఘనంగా పెరిగిపోతున్నా దానిని అదుపు చేయటంలో  కేంద్రం విఫలమైందన్నారు. మైనారిటీలపై దాడులు పెరిగిపోయాయన్నారు. గుజరాత్లో ముస్లింల పైన, మణుపూర్లో క్రైస్తవుల పైన దాడులు కొనసాగుతున్నాయన్నారు. భిన్నత్వంలో ఏకత్వానికి భారతదేశం చిహ్నంగా ఉందని, ఇలాంటి దేశంలో హిందూ సామ్రాజ్య స్థాపన కోసం ఆర్ఎస్ఎస్ తీవ్రంగా కృషి చేస్తుందన్నారు. ఫలితంగానే వారికి బద్ద శత్రువులుగా ఎంచుకున్న ముస్లింలు, క్రైస్తవులపై దాడులు కొనసాగుతున్నాయని, తదుపరి కమ్యూనిస్టులపై కూడా ఇవే దాడులు జరగనున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు వైసిపి రాష్ట్రంలో వంత పాడుతుందన్నారు. కేంద్రం తెచ్చిన విద్యుత్ చట్టాన్ని బలవంతంగా ప్రజలపై రుద్దుతుందని, ఫలితంగా విద్యుత్ ఛార్జీలు గణనీయంగా పెరిగాయన్నారు. ఎన్టీఆర్ హయాం నుంచి  రైతులకు ఉచిత విద్యుత్ అమలులో ఉందని, ఇప్పుడు ఆ స్థానంలో బిల్లులు ప్రభుత్వమే చెల్లిస్తుందంటూ మీటర్ల బిగించే ప్రయత్నం చేస్తున్నారని, దానిని సిపిఎం తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు.. రాష్ట్రాల హక్కులు బిజెపి కబంధహస్తాలలో ఉన్నాయన్నారు. అమరావతి రాజధాని కోసం 33,700 ఎకరాలు భూసేకరణ జరిగిందని, అమరావతి రాజధానిగా అప్పట్లో అంగీకరించిన సీఎం జగన్, దానికి భిన్నంగా ఇప్పుడు విశాఖపట్నం  నుంచి పాలన జరుగుతుందని చెప్పడమేమిటని ప్రశ్నించారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులు అయోమయంలో ఉన్నారన్నారు. ఏకైక రాజధానిగా అమరావతి ఉండాలని సిపిఎం డిమాండ్ చేస్తుందన్నారు. సంక్షేమ పథకాలే రాష్ట్ర అభివృద్ధికి చిహ్నం కాదని, వ్యవసాయం వ్యవసాయ ప్రాజెక్టులు అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. జగనన్న కాలనీలలో గృహ నిర్మాణాలకు ప్రభుత్వం ఇస్తున్న రూ.1.80 లక్షలు ఏమాత్రం చాలదని కనీసం ఐదు లక్షలు చెల్లించాలన్నారు. దాదాపు లక్ష కుటుంబాలు ప్రభుత్వ పోరంబోకు స్థలాలలో తలదాచుకుంటున్నాయని, వాటిని క్రమబద్ధీకరించి పట్టాలు ఇవ్వాలన్నారు. డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలన్నారు. దళితుల స్మశాన వాటికలకు స్థలాలు కేటాయించాలని, గతంలో పల్లపు ప్రాంతాలలో ఇచ్చిన నివేశన స్థలాలకు ప్రభుత్వమే మెరకలు తోలించాలని డిమాండ్ చేశారు. పెదవడ్లపూడి హై లెవెల్ ఛానల్ కు రెండు కోట్లు మంజూరు చేసి సాగునీటి సమస్యకు చెక్ పెట్టాలన్నారు. గుంటూరు ఛానల్ ను పర్చూరు వరకు విస్తరింపజేసి 270 కోట్లు వెచ్చించి సాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. కేంద్రంలోని బిజెపిని ఓడించేందుకు అన్ని శక్తులు ఏకం కావాలని పిలుపునిచ్చారు. 15న విజయవాడలో జరిగే ప్రజారక్షణ భేరి  సభను జయప్రదం చేయాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు భాస్కరయ్య, రాష్ట్ర నాయకులు దయా రమాదేవి, బి శివ నాగరాణి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు భవనన్నారాయణ, సీనియర్ నాయకులు ములకా శివసాంబిరెడ్డి, షేక్ హుస్సేన్ వలి, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఎన్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.