Oct 30,2023 11:21
  • పండుగల వేళ మత సామరస్యం కోసం కృషి

కొల్‌కతా : పండుగల వేళ పశ్చిమబెంగాల్‌లో మత సామరస్యంపై విస్తృత ప్రచారం నిర్వహించేందుకు సిపిఎం కృషి చేస్తోంది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 1000 పుస్తక ప్రదర్శన కేంద్రాలను ఏర్పాటు చేసింది. ప్రగతిశీల సాహిత్యాన్ని వ్యాప్తి చేయడమే కాకుండా రాష్ట్రంలో మత సామరస్యాన్ని కాపాడేందుకు కూడా ఈ కేంద్రాలను ఉపయోగించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చింది. ప్రతి సంవత్సరం మాదిరిగానే రాజధాని కొల్‌కతా నగరంలో సిపిఎం 200కు పైగా పుస్తక కేంద్రాలను ఏర్పాటు చేసింది. సిపిఎంతో పాటు ఇతర వామపక్ష పార్టీలైన సిపిఐ (ఎంఎల్‌) లిబరేషన్‌, ఎస్‌యూసిఐ, ఆర్‌ఎస్‌పి, ఫార్వర్డ్‌బ్లాక్‌, సిపిఐ కూడా పుస్తక కేంద్రాలను ఏర్పాటు చేశాయి. తృణమూల్‌ కాంగ్రెస్‌, బిజెపి కూడా ఇలాంటి కేంద్రాలను ఏర్పాటు చేసినప్పటికీ వాటి సంఖ్య తక్కువగానే ఉంది. అవి కూడా పట్టణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. తృణమూల్‌ పుస్తక కేంద్రాలు పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ రాసిన 40కి పైగా పుస్తకాలు, ఆమె గీసిన చిత్రాలతో నిండిపోయాయి. బిజెపి పుస్తక కేంద్రాలు మోడీ, శ్యాంప్రసాద్‌లపై దృష్టి సారించగా కాంగ్రెస్‌ కేంద్రాల్లో గాంధీజీ సిద్ధాంతం, నెహ్రూ గురించిన పుస్తకాలే ఎక్కువగా కన్పిస్తున్నాయి. అయితే వామపక్షాలు ఏర్పాటు చేసిన ప్రగతిశీల పుస్తక కేంద్రాల్లో మాత్రం అన్ని రకాల పుస్తకాలు, ప్రధానంగా ప్రజల మధ్య సామరస్యాన్ని పెంపొందించే పుస్తకాలు లభిస్తున్నాయి.