- ప్రభుత్వ కళాశాలల్లో ఉచిత పుస్తకాల పంపిణీ నిలిపివేత
- అమ్మఒడి పేరుతో ఎగనామం
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : 'విద్యారంగానికి వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం, ఏ రాష్ట్రం కూడా ఇంత మొత్తంలో విద్యకు ఖర్చు చేయడం లేదు' అని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న మాట. ఇంత ఖర్చు చేస్తున్నా.. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న ఇంటర్మీడియట్ విద్యార్థులకు పుస్తకాలను అందించలేకపోతుంది. ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్థుల కోసం కేవలం రూ.15 కోట్లను ప్రభుత్వం ఖర్చుపెట్టకపోవడం గమనార్హం. నాలుగేళ్లుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచిత పుస్తకాలు అందించలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. రాష్ట్రంలో 474 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల విద్యార్థులు సుమారు 1.30 లక్షల మంది ఉన్నారు. వీరికి పుస్తకాల కోసం అయ్యే ఖర్చు రూ.15 కోట్ల లోపే ఉంటుంది. వైసిపి అధికారంలోకి వచ్చాక 2019-20 విద్యా సంవత్సరానికి మాత్రమే ఉచిత పుస్తకాలను అందించింది. మధ్యలో కొంతకాలం వరకు తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) పుస్తక ప్రసాదం పేరుతో అందించింది. గతేడాది నుంచి విద్యార్థులకు ఉచిత పుస్తకాలను అందించడం లేదు. ఈ ఏడాది కూడా పుస్తకాల ముద్రణకు ఆర్థికసాయం చేయాలని ఇంటర్మీడియట్ బోర్డు టిటిడికి లేఖ రాసినా ఫలితం లేకుండాపోయింది. టిటిడి తిరస్కరించడంతో ఆర్థికశాఖకు కూడా బోర్డు లేఖ రాసింది. అమ్మఒడి పథకం ఇంటర్ విద్యార్థులకు కూడా అందిస్తున్నామని, కాబట్టి పుస్తకాలను అందించలేమని బోర్డుకు ఆర్థికశాఖ తెలిపింది. అమ్మఒడి పేరుతోనే మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా ప్రభుత్వ కళాశాలల్లో ప్రభుత్వం నిలిపేసింది. తెలుగు అకాడమీ బయట మార్కెట్‌లో అమ్మేందుకు మొదటి సంవత్సరం పుస్తకాలను 5 లక్షలు, ద్వితీయ సంవత్సరం విద్యార్థుల కోసం 3.5 లక్షలను ముద్రించింది. బయట మార్కెట్ నుంచి కొనుగోలు చేయాలంటే సైన్స్ పుస్తకాలు సుమారు రూ.2,500, ఆర్ట్స్ గ్రూపు పుస్తకాలు సుమారు రూ.1,500 వరకు ఖర్చవుతోంది. పుస్తకాల పంపిణీ నిలిపివేయడంతో ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు కొనలేని పరిస్థితి నెలకొంది. లెక్చరర్లే రెండో ఏడాది పూర్తయిన విద్యార్థుల నుంచి సేకరించి కొంతమంది విద్యార్థులకు సర్దుబాటు చేస్తున్న పరిస్థితి నెలకొంది. కొంత ఆర్థిక వెసులుబాటు ఉన్న విద్యార్థులు బయట మార్కెట్ నుంచి కొనుగోలు చేసుకుంటున్నారు. విద్యార్థులు పుస్తకాలు ఉన్నా మొత్తం చదవలేరని, లెక్చరర్లు చెబుతున్న ముఖ్యమైన పాఠాలను విద్యార్థులు నోట్ పుస్తకాల్లో రాసుకుంటున్నారని ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు సమాధానం చెబుతున్నారు. కెజిబివి, మోడల్ స్కూళ్లు, ఎపి రెసిడెన్షియల్, గిరిజన, సాంఘిక, బిసి వెల్ఫేర్ కళాశాలల్లోని విద్యార్థులకు ఉచిత పుస్తకాలను ప్రభుత్వమే అందిస్తోంది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులపై ఈ వివక్షను ప్రభుత్వం ఎందుకు చూపుతోందో అర్థం కావడం లేదు.
కెజిబివి, మోడల్ స్కూల్ విద్యార్థులదీ అదే పరిస్థితి
కెజిబివి, మోడల్ స్కూల్ విద్యార్థులకు కూడా పూర్తిస్థాయిలో పుస్తకాలు అందని పరిస్థితి నెలకొంది. ఎన్‌టిఆర్ జిల్లాలోని ఒక మోడల్ స్కూల్‌లో మొత్తం ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు 1,490 పుస్తకాలు సరఫరా చేయాల్సి ఉంది. ఇందులో 367 పుస్తకాలు మాత్రమే ఇప్పటివరకు అందాయి. ద్వితీయ సంవత్సరం తెలుగు, ఇంగ్లీష్, మేథ్స్, ఫిజిక్స్‌్, కెమిస్ట్రీ, బోటనీ, ఎకనామిక్స్ పుస్తకాలు అందలేదు. కెజిబివి, రెసిడెన్షియల్ పాఠశాలల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది.