- తరలివచ్చిన దేశ, విదేశీ ప్రతినిధులు
- ప్రత్యేక ఆకర్షణగా రెడ్ ఫ్లాగ్‌మార్చ్
- జాతీయ జెండా ఎగురవేసిన ఏటుకూరి కృష్ణమూర్తి
- పార్టీ పతాకం ఆవిష్కరించిన సురవరం
పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన సురవరం
సిపిఐ పతాకాన్ని పూర్వ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపి సురవరం సుధాకర్‌రెడ్డి ఆవిష్కరించి, మహాసభల ప్రారంభానికి సంకేతమిచ్చారు. దేశ, విదేశాల నుంచి తరలివచ్చిన పార్టీ శ్రేణులకు, ప్రతినిధులకు ఆయన విప్లవాభివందనలు తెలిపారు.
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : సిపిఐ 24వ జాతీయ మహాసభ విజయవాడ గురుదాస్ దాస్ గుప్తా ప్రాంగణం (ఎస్‌ఎస్ కన్వెన్షన్ సెంటరు)లోని షమీమ్ ఫైజీ హాలులో శనివారం ప్రారంభమైంది. దేశ, విదేశాల నుంచి ప్రతినిధులు, సిపిఐ, వామపక్ష పార్టీల నేతలు హాజరయ్యారు. మహాసభ జరిగే ప్రాంగణం నుంచి బందరురోడ్డు వరకూ ఎర్రతోరణలతో ఆకర్షణీయంగా అలంకరించారు. యువజన, విద్యార్థి సంఘాల ప్రతినిధుల రెడ్‌ప్లాగ్‌మార్చ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రారంభ సూచికగా ఉదయం 10:30 గంటలకు జాతీయ పతాకాన్ని ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు ఏటుకూరి కృష్ణమూర్తి ఎగురవేశారు. తొలుత ఏటుకూరి కృష్ణమూర్తిని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా, జాతీయ కార్యదర్శులు కె నారాయణ, అతుల్‌కుమార్ అంజన్, రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా స్వాతంత్య్రోద్యమ చరిత్ర, జాతీయ జెండా స్ఫూర్తితో ఉద్యమం ముందుకెళ్లాలని సందేశమిచ్చారు. మోడీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలన్నారు.
అమర జ్యోతి వెలిగించిన 'ఈడ్పుగంటి'
అమరవీరుల స్థూపాన్ని సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషన్ పూర్వపు ఛైర్మన్ ఈడ్పుగంటి నాగేశ్వరరావు ఆవిష్కరించి, అమరజ్యోతిని వెలిగించి నివాళులర్పించారు. అనంతరం మహాసభ (ప్రతినిధుల సభ) లాంఛనంగా ప్రారంభమైంది. ఆహ్వాన సంఘం అధ్యక్షులు, సిపిఐ కార్యదర్శి కె నారాయణ స్వాగత ఉపన్యానం చేశారు. సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా ప్రారంభోపన్యాసం చేశారు. సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సిపిఐ(ఎంఎల్) నాయకులు దీపాంకర్ భట్టాచార్య, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్యాక్ (ఎఐఎఫ్‌బి) నాయకులు కామ్రేడ్ జి దేవరాజన్ సందేశాలిచ్చారు. వివిధ దేశాలకు చెందిన సౌహార్థ్ర ప్రతినిధులతోపాటు సిపిఐ జాతీయ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నేతలు వేదికను అలంకరించారు. మహాసభకు అధ్యక్ష వర్గంగా రామేంద్రకుమార్, సయ్యద్ అజీజ్ పాషా, గిరీష్, పి సందోష్‌కుమార్, నిషా సిద్ధు, రామకృష్ణ పాండు, జంకి పాశ్వన్, మంజూ కావాసి, సుఖ్‌జిందర్ మహేసరి, సంఘమ్ మిత్రా జీనా, వై యుదిస్టర్‌దాస్ వ్యవహరించారు. ఈ కార్యక్రమాల్లో జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకట్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహాయ కార్యదర్శులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, జెవి సత్యనారాయణమూర్తి, పువ్వాడ నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గసభ్యులు (మాజీ ఎమ్మెల్సీ) జల్లి విల్సన్, అక్కినేని వనజ, దోనేపూడి శంకర్, కృష్ణా జిల్లా కార్యదర్శి నార్ల వెంకటేశ్వర్లు, విజయవాడ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు, జాతీయ, రాష్ట్ర, నాయకులు పాల్గొన్నారు.










