Jul 27,2023 21:37
  •  విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ

ప్రజాశక్తి - ఉక్కునగరం (విశాఖపట్నం) : వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి స్పందించాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు డిమాండ్‌ చేశారు. వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలో తలపెట్టిన రిలే దీక్షలు గురువారానికి 896వ రోజుకు చేరాయి. దీక్షల్లో స్టీల్‌ ఎంఎంఎస్‌ఎం, ఎస్‌బిఎం కార్మికులు కూర్చున్నారు. వారినుద్దేశించి పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ, నాయకులు వరసాల శ్రీనివాసరావు, గంధం వెంకటరావు, దాసరి శ్రీనివాస్‌, ట్రాన్స్‌పోర్టు అసోసియేషన్‌ నాయకులు ఏడిద భార్గవ్‌ మాట్లాడారు. విశాఖ ఉక్కు కర్మాగారంపై విషం చిమ్ముతున్న అదానీ గంగవరం పోర్టు ఎత్తుగడలను కూకటి వేళ్లతో సహా పెకిలించేందుకు ఉక్కు కార్మికులు సన్నద్ధమవుతున్నారని తెలిపారు. ప్లాంట్‌కు రావాల్సిన కొకింగ్‌ కోల్‌ను పోర్టు యజమాన్యం అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. త్వరితగతిన సమస్యను పరిష్కరించకుంటే గంగవరం పోర్టుకు వెళ్లే రోడ్డు, రైలు మార్గాలు సహా నీరు, విద్యుత్‌ను స్తంభింపజేస్తామని హెచ్చరించారు. ఉద్దేశ పూర్వకంగానే పోర్టు యాజమాన్యం విశాఖ ఉక్కు కర్మాగారానికి అవరోధాలు కలిగిస్తోందని మండిపడ్డారు. దీక్షల్లో నాయకులు జివి.రమణ, దేవుడు, మహమ్మద్‌, కొయిలాడ శ్రీను. శనిబాబు, రమేష్‌ నాయుడు, రాంబాబు పాల్గొన్నారు.