
- బటన్ నొక్కి వైఎస్‌ఆర్ లా నేస్తం జమ చేసిన సిఎం జగన్‌మోహన్‌రెడ్డి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : యువ న్యాయవాదులు న్యాయవాద వృత్తిలో రాణించేందుకు తొలి మూడేళ్లపాటు నెలకు రూ.5 వేలచొప్పున వైఎస్‌ఆర్ లా నేస్తం పేరుతో స్టైఫండ్ ఇస్తున్న రాష్ట్రం దేశంలో ఎక్కడా లేదని, రాష్ట్రంలో అమలవుతున్న ఈ పథకాన్ని యువ న్యాయవాదులు సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. వైఎస్‌ఆర్ లా నేస్తం పథకానికి సంబంధించి 2,677 మంది జూనియర్ న్యాయవాదులకు ఐదు నెలలకుగానూ ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున సిఎం బటన్ నొక్కి రూ.6.12 కోట్లను నేరుగా వారి ఖాతాల్లోకి సోమవారం జమ చేశారు. రాష్ట్రంలో మూడేళ్లుగా వైఎస్‌ఆర్ లా నేస్తం పథకాన్ని అమలు చేస్తున్నామని సిఎం తెలిపారు. యువ న్యాయవాదులకు ఏడాదికి ప్రభుత్వం ఇచ్చే రూ.60 వేలు వారు ప్రాక్టీస్ పరంగా నిలదొక్కుకునేందుకు దోహదపడుతుందన్నారు. మూడేళ్ల కాలంలో ఒక్కొక్కరికీ రూ.1.8 లక్షల ఆర్థికసాయాన్ని ప్రభుత్వం అందించిందని తెలిపారు. ఇప్పటిదాకా ఈ పథకం కింద 5,781 మందికి రూ.41.52 కోట్లను అందించామన్నారు. న్యాయవాదుల సంక్షేమం కోసం ప్రభుత్వం రూ.100 కోట్లతో వెల్ఫేర్ ట్రస్టును ఏర్పాటు చేసిందని తెలిపారు. ఈ ట్రస్టు ద్వారా ఇప్పటి వరకూ మెడిక్లెయిమ్, ఇతర అవసరాల కోసం రూ.25 కోట్లను న్యాయవాదుల కోసం ఖర్చు చేశామన్నారు. న్యాయవాదులకు రాష్ట్ర ప్రభుత్వం తోడుగా వుంటుందని, ఇదే స్ఫూర్తితో ప్రతి న్యాయవాది పేదలపట్ల మమకారం చూపాలని కోరారు. అర్హులైన వారు వుంటే వైఎస్‌ఆర్ లా నేస్తం పథకానికి దరఖాస్తును లా సెక్రటరీకి చేసుకోవాలని సూచించారు. వైఎస్‌ఆర్ లా నేస్తం పథకానికి సంబంధించి న్యాయవాదుల ఇబ్బందులను అధిగమించేందుకు 1902 నెంబరుకు ఫోన్ చేసి పరిష్కరించుకోవాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్‌రెడ్డి, లా సెక్రటరీ జి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.