Oct 14,2023 21:45

'విజయవాడ సెంట్రల్‌'లో ముగిసిన ప్రజాపోరు పాదయాత్ర
ప్రజాశక్తి - విజయవాడ :వైసిపి అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్లలో ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి విజయవాడలో ఉద్దరించిందేమీలేదని, ఇప్పుడు విశాఖపట్నం వెళ్లి ఒరగబెట్టేదేమిలేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. ఇప్పటి వరకు విజయవాడను ఏవిధంగానూ అభివృద్ధి చేయలేదని తెలిపారు. విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలో చేపట్టిన 'సిపిఎం ప్రజాపోరు పాదయాత్ర' శనివారంతో ముగిసింది. ఈ సందర్భంగా బీసెంట్‌ రోడ్డులో ప్రదర్శన, ముగింపు సభ నిర్వహించారు. సభకు ముందుగా నగరంలోని 23, 24 డివిజన్లలో పాదయాత్ర నిర్వహించారు. అనంతరం పార్టీ సెంట్రల్‌ సిటీ కార్యదర్శి భూపతి రమణారావు అధ్యక్షతన జరిగిన సభలో శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజాసంక్షేమాన్ని విస్మరించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల పేరుతో రూ.లక్షల కోట్లు వసూలు చేస్తూ ప్రజలను పీక్కుతింటున్నాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ, అభివఅద్ధిని పూర్తిగా విస్మరించిందన్నారు. రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం కేంద్రంతో జతకట్టి అదానీ తదితర కార్పొరేట్లకు సహజ వనరులను కట్టబెడుతోందని తెలిపారు. రాష్ట్రంలో కేజీ బేసిన్‌ నుండి గ్యాస్‌ ఉత్పత్తి అవుతోందని, ఈ నేపథ్యంలో రూ.400లకే గ్యాస్‌ ఇచ్చే అవకాశం ఉన్నా రూ.950లకు పెంచారన్నారు. సోలార్‌ విద్యుత్‌ను రూపాయికి ఒక యూనిట్‌ ఉత్పత్తి చేసే అవకాశమున్నా కార్పొరేట్ల ప్రయోజనాల కోసం భారీగా విద్యుత్‌ ఛార్జీలను పెంచారని తెలిపారు. పేదలకు ఇళ్లు, ఇళ్ల పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చి నమ్మకద్రోహం చేశాయన్నారు. పౌర సదుపాయాలను వ్యాపారమయం చేశారని తెలిపారు. ప్రజారోగ్యం దెబ్బతిని, జ్వరాలు విజఅంభిస్తున్నా పాలకులు మొద్దు నిద్రలో ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలు బూతు రాజకీయాల్లో మునిగి తేలుతుండగా... ప్రజా సమస్యలే అజెండాగా చేసుకొని సిపిఎం రాజీలేని ప్రజాపోరాటాలు చేస్తూ ముందుకు సాగుతోందన్నారు. పాదయాత్రకు నేతృత్వం వహించిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు మాట్లాడుతూ విజయవాడలో గృహ నిర్మాణంపై అధికార పార్టీ ప్రజా ప్రతినిధులతో తాము బహిరంగ చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్‌, నగర నాయకులు కాజ సరోజ, ఎం.సీతారాములు, టి.ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.