జోరునగర్ : దుండగుల దాడిలో టిఎంసి నేత సైఫుద్దీన్ లస్కర్ (47) మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం పశ్చిమ బెంగాల్‌లోని జోరునగర్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బమున్‌గాచి ఏరియా టిఎంసి అధ్యక్షుడు సైఫుద్దీన్ లస్కర్ సోమవారం ఉదయం ప్రార్థనలకు బయటకు వచ్చారు. అతను రోడ్డుపై నడుస్తుండగా..దుండగులు బైక్‌పై వెళుతూ.. తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో లస్కర్ అక్కడికక్కడే మృతి చెందారు. లస్కర్‌పై కాల్పులు జరిపి దుండగులు పారిపోవడం సిసిటివి ఫుటేజ్ దృశ్యాలు లభ్యమయ్యాయని పోలీసులు తెలిపారు.
జారునగర్‌లోని బమున్‌గాచి ప్రాంతంలో తృణమూల్ యూనిట్‌కు లస్కర్ నాయత్వం వహిస్తున్నారు. అతని భార్య గ్రామ సర్పంచ్‌గా ఉన్నారు. లస్కర్ హత్య తర్వాత తృణమూల్ కాంగ్రెస్ మద్దతుదారుల గుంపు కోపోద్రిక్తులై 20 ఇళ్లను తగలబెట్టింది. అలాగే ఈ గుంపు ఓ అనుమానితుడిని కొట్టి చంపారు. అయితే ఆ వ్యక్తి కూడా తృణమూల్ కాంగ్రెస్ మద్దతుదారుడేనని లస్కర్ భార్య తెలిపారు. ఇక లస్కర్ హత్యతో తమకెలాంటి సంబంధం లేదని సిపిఎం పేర్కొంది.