న్యూఢిల్లీ : తృణమూల్ కాంగ్రెస్ ఎంపి మహువా మొయిత్రా పార్లమెంటులో ప్రముఖ వ్యాపారవేత్త అదానీ, ప్రధాని మోడీపై ప్రశ్నలు అడిగేందుకుగాను వ్యాపారవత్తే దర్శన్ హీరానందానీని డబ్బులు అడిగినట్లు బిజెపి ఎంపి నిషికాంత్ దూబే స్పీకర్ ఓంబిర్లాకు ఫిర్యాదు చేశారు. నిషికాంత్ ఫిర్యాదు మేరకు స్పీకర్ ఎథిక్స్ కమిటీకి సిఫార్సు చేశారు. ఈ ఆరోపణలపై టిఎంసి ఎంపి మహువా ఖండించారు. 'ప్రశ్న కోసం నగదు'కు సంబంధించి తనపై వచ్చిన ఆరోపణలపై సిబిఐ కానీ, ఎథిక్స్ కమిటీ కానీ తనని ప్రశ్నిస్తే సమాధానమివ్వడానికి తాను సిద్ధమే మహువా శుక్రవారం తెలిపారు. ఈ మేరకు ఆమె తన ఎక్స్‌లో పోస్టు చేశారు. 'సిబిఐ కానీ, ఎథిక్స్ కమిటీ (ఈ కమిటీలో బిజెపి సభ్యులకు పూర్తి మెజారీటీ ఉంది) నన్ను పిలిచి పిలిచి 'ప్రశ్న కోసం నగదు'కు సంబంధించి ప్రశ్నిస్తే నేను వారికి సమాధానమిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను. నాపై అదానీ మీడియా, బిజెపిలు చేసే ట్రోల్స్‌పై సమాధానమివ్వడానికి నాకు సమయం.. ఆసక్తి లేవు. ప్రస్తుతం నేను నదియాలో దుర్గా పూజను ఆస్వాదిస్తున్నాను. శుభో షష్టి' అని మహువా తన ఎక్స్‌లో పోస్టు చేశారు.