Oct 28,2023 16:37

న్యూఢిల్లీ : పార్లమెంటులో డబ్బులు తీసుకుని ప్రశ్నలు అడిగారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్‌ ఎంపి మహువా మొయిత్రా కోరుకున్నట్టుగా విచారణ తేదీని శనివారం ఎథిక్స్‌ కమిటీ మార్పు చేసింది. నవంబర్‌ 2వ తేదీన విచారణకు రావాలని కమిటీ పేర్కొంది. గతంలో అక్టోబర్‌ 31న విచారణకు హాజరుకావాలని ఎథిక్స్‌ కమిటీ ఆమెకు నోటీసులిచ్చింది. అయితే ఆ నోటీసులు తనకు అందేముందే మీడియాలో లీక్‌ అయిందని.. టీవీల్లో ప్రసారం చేశారని ఆమె ఆరోపిస్తూ ఎథిక్స్‌ కమిటీకి లేఖ రాసింది. 30 నుంచి నవంబర్‌ 4 వరకు తన నియోజకవర్గంలో ముందుగా షెడ్యూల్‌ చేసిన కార్యక్రమాల వల్ల తాను విచారణకు రాలేనని ఆమె తన లేఖలో పేర్కొన్నారు. తన విచారణ తేదీ మార్చాలని ఆమె లేఖలో పేర్కొన్నారు. అయితే ఆమె కోరుకున్నట్టుగా నవంబర్‌ 4వరకు కాకుండా.. నవంబర్‌ 2వ తేదీన కమిటీకి తన వాదనల్ని సమర్పించాలని ఈ మేరకు ఆమెకు సమన్లు పంపింది. ఇకపై విచారణ తేదీ మార్చడం కుదరదని కమిటీ స్పష్టం చేసింది. ఇక ఇప్పటికే ఈ కేసులో సుప్రీంకోర్టు న్యాయవాది జై అనంత్‌ దేహద్రారు, బిజెపి ఎంపి నిషికాంత్‌ దూబే ఇప్పటికే ఎథిక్స్‌ కమిటీ ముందు తమ వాంగ్మూలాలను నమోదు చేశారు.